రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత పార్టీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై పేదలకు దక్కాల్సిన నిధులను ఎలా స్వాహా చేశారో ఆధారాలతో సహ బయటపెట్టారు. రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలో పేదరిక నిర్మూలనకు వినియోగించాల్సిన మెప్మా నిధులు రూ.1.22 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి దోచేశారని సొంత పార్టీపైనే ఆరోపణలు గుప్పించారు.
ఇంతకీ ఏం జరిగింది –
రామచంద్రపురం పట్టణానికి చెందిన లబ్ధిదారులకు గత ప్రభుత్వం వెల్ల, వెల్లసావరం, ఉండూరు, హసనబాద గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఐతే, ఇళ్ల నిర్మాణం పేరుతో మెప్మా నిధులను అప్పటి మున్సిపల్ కమిషనర్ దారి మళ్లించారని, చివరకు అక్కడ ఇళ్లు కట్టకుండానే నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్లతో కలిసి నిర్మాణ సామగ్రిని మాయం చేశారని బోస్ ఆరోపించారు. RTI ద్వారా సేకరించిన పక్కా ఆధారాలను ప్రదర్శిస్తూ, నాడు జరిగిన అధికార దుర్వినియోగాన్ని కళ్లకు కట్టారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యమంటున్నారు టీడీపీ నేతలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలు పట్టించుకోకుండా, పేదల నిధులను సైతం పక్కదారి పట్టించారని మండిపడుతున్నారు. అక్రమాల కారణంగా బదిలీపై వెళ్లిన ఓ అమాయక ఉద్యోగి, తన సొంత జేబులోంచి రూ.40 లక్షలు కట్టాల్సి వచ్చిందని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు ఎంతలా భ్రష్టుపట్టాయో, ప్రజాధనాన్ని ఎలా దోచుకున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది.
ఈ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి మరియు కలెక్టర్లకు లేఖలు రాస్తున్నట్లు వెల్లడించారు. అవినీతిని అంతం చేయడానికి సొంత పార్టీ ఎంపీనే, అధికారంలో ఉన్న ప్రత్యర్థి ప్రభుత్వాన్ని విచారణ కోరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.











