ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో పాటు లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు RMZ సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా విశాఖ కాపులుప్పాడలో ఫేజ్ – 1 ఐటీ పార్కులో 50 ఎకరాల్లో GCC పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి నారా లోకేష్.. RMZ సంస్థ ఛైర్మన్ మనోజ్ మెండాతో చర్చలు జరిపారు. రాబోయే ఐదేళ్లలో ఏపీలో దాదాపు 91 వేల కోట్లు అంటే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మనోజ్ ప్రకటించారు. రాయలసీమలో ఇండస్ట్రీయల్, లాజిస్టిక్ హబ్‌ల అభివృద్ధితో పాటు నెక్ట్స్ జన్ మిక్స్డ్ యూజ్ డిజిటల్ వసతుల కేంద్రంగా విశాఖ మారనుంది.
విశాఖపట్నం కేంద్రంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ హబ్‌ను నిర్మించాలన్న లోకేష్ సంకల్పానికి ఈ ప్రాజెక్టు వెన్నెముకగా నిలవనుంది. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం 1 గిగావాట్ సామర్థ్యం గల అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక డిజిటల్, AI వర్క్‌లోడ్‌కు మద్దతిచ్చే ఈ ప్రాజెక్టుకు దాదాపు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం కానుంది.
ఇక, రాయలసీమలో 1,000 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్కును కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ఇంటర్నేషనల్ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. సింగిల్ విండో అనుమతులు, పారదర్శకమైన పాలనపై ఇస్తున్న భరోసాతో ఇంటర్నేషనల్ కంపెనీలు ఏపీ వైపు క్యూ కడుతున్నాయి.











