ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే 3 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం, మౌలిక వసతులు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించడంతో తల్లిదండ్రుల్లో సర్కారు చదువులపై నమ్మకం పెరిగింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాలికల ఉన్నత పాఠశాల ఏకంగా 3,250 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కార్పొరేట్ ప్రైవేట్ బళ్లను తలదన్నేలా ఇక్కడ ప్రవేశాలు లభిస్తున్నాయి. కాగా, విశాఖపట్నంలోని ప్రముఖ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2,904 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పాఠశాలగా నిలిచింది. ఒకానొక దశలో చంద్రంపాలెం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏకంగా 4 వేలు దాటడం విశేషం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. లోకేష్ స్వయంగా ఈ పాఠశాలలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రత్యేకంగా హైటెక్ కంప్యూటర్ లేబొరేటరీలు, సరికొత్త డిజిటల్ వసతులు కల్పించడంలో లోకేష్ ప్రత్యేక చొరవ చూపారు. దీనికి తోడు దివీస్ లేబొరేటరీస్ వంటి ప్రముఖ సంస్థల CSR నిధులను సమీకరించి పాఠశాల మైదానాలను, మౌలిక వసతులను ఇంటర్నేషనల్ లెవల్‌లో అభివృద్ధి చేశారు.
గతంలో దూరప్రాంతాల నుంచి సైతం చంద్రంపాలెం పాఠశాలకే రావలసి రాగా, ఇప్పుడు ఆ ప్రాంతాల్లోని బక్కన్నపాలెం అప్పర్ ప్రైమరీ పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయడం, సునీల్ శర్మ కాలనీ పాఠశాలలో వసతులు మెరుగుపరచడంతో విద్యార్థుల రద్దీ ఇతర సర్కారీ బళ్లకు కూడా సమానంగా విస్తరించింది. లోకేష్ మార్క్ విద్యా సంస్కరణలతో నాడు ఒక్క పాఠశాలకే పరిమితమైన ఆదరణ, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తుండటం విశేషం.











