రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే అంత వీజీ కాదు.
రోడ్ల మీదకు కిరాయి మూకలను తీసుకువచ్చి.. వారే బాధితులను మాయమాటలు చెప్పి.. వారి కళ్లు తుడుస్తున్నట్టుగా.. వారికి న్యాయం కోసం పోరాడుతున్నట్టుగా టక్కుటమార విద్యలు ప్రదర్శించవచ్చు. కానీ.. హైకోర్టు ఎదుట అలాంటి ఇంద్రజాలం పనికిరాదు. అందుకే మెగా డీఎస్సీ విషయంలో తప్పుడు ఆరోపణలు, తప్పుడు డిమాండ్లతో హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తల బొప్పి కట్టింది. ‘‘పిల్ ఎంతో విలువైన ఆయుధం. రాజకీయ ప్రయోజనాల కోసం దానిని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు’’ అని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నవ్యాఖ్యలు చాలా కీలకమైనవి. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసినట్టుగా, న్యాయపీఠాన్ని మోసం చేయలేం అని ఈ వ్యాఖ్యలు జగన్ కు గుణపాఠం చెబుతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల సాక్షిగా జగన్ పరువు బురదలో కలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, సీబీఐ విచారణకు ఆదేశించాలనేది ఆయన డిమాండ్. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్టుగా ఆయన పిటిషన్ సాగిపోయింది. ఆ పిల్ లో జోక్యంచేసుకోడానికే హైకోర్టు నిరాకరించింది. అందులో పేర్కొన్నట్టుగా క్రీడల కోటా రిజర్వేషన్ పెంచడంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే.. వాళ్లే ముందుకొచ్చి కేసులు వేసేవాళ్లు కదా.. అని కోర్టు అడిగింది. అభ్యర్థులను ప్రభుత్వం భయపెడుతోంది గనుక.. వారు కోర్టుకు రాలేకపోతున్నారని పిటిషనర్ వాదనలు కూడా కోర్టు ఎదుట తేలిపోయాయి. ప్రభుత్వం భయపెట్టడమే నిజమైతే.. 335 రిట్ పిటిషన్లు ఎలా దాఖలయ్యాయంటూ కోర్టు ప్రశ్నించడం విశేషం. రిజర్వేషన్ కోటా పెంపు కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా జరిగినదే కదా అని కూడా వ్యాఖ్యానించింది. పిల్ ఉపసంహరించుకుంటారా? లేదా? అని కూడా న్యాయమూర్తులు ప్రశ్నించడం గమనించాలి.
జగన్ ఎంచక్కా తన ప్యాలెస్ లో కూర్చుని.. పార్టీ వాళ్లను రోడ్ల మీదికి తోలి.. డీఎస్సీలో అక్రమాలు అంటూ నిరసనలు చేయించారు. నిరుద్యోగ టీచర్లు, అభ్యర్థులు తరలివచ్చారంటూ.. సాయంత్రం అయ్యాక ఎక్స్ లో జగన్ ప్రవచించారు. నిజానికి కిరాయిమూకల్ని నిరుద్యోగుల ముసుగులో పోగేసి.. డ్రామాలు నడిపించారు. వైసీపీ మాటలను నిజంగా డీఎస్సీ అభ్యర్థులే గనుక నమ్మి ఉంటే.. వారి నిరసనల్లో ఒక్క నిజమైన నిరుద్యోగి అయినా పాల్గొని ఉంటే.. వారి పిల్ విషయంలో ఎందుకు కలిసి నడవలేదు.. అనేది ఇక్కడ కీలకం. కోర్టును కూడా తప్పుడు పిల్ లతో తప్పుదారి పట్టించాలని చూసిన వైసీపీ ప్రయత్నం విఫలమైంది. హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల సాక్షిగా జగన్ పరువు బురదలో కలిసినట్లు అయిందని.. ప్రజలు అనుకుంటున్నారు.











