సెప్టెంబర్ 17 విమోచన దినమా? విలీన దినమా? విద్రోహ దినమా?లేక స్వాతంత్య్రమా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో కూడా దీనిపై స్పష్టత లేదు. అసలు ఈ రోజును ఎలా జరుపుకోవాలనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నగానే మిగిలింది. రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా దీన్ని మార్చుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికినీ సెప్టెంబర్ 17ను నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు స్వాతంత్య్రం, విముక్తి దొరికిన రోజుగానే చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ప్రజల మనోభావాలను పక్కన పెట్టి సెప్టెంబర్ 17ను కేవలం ఓటు బ్యాంకు కోసం వాడుకునే రోజుగానే చూస్తున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 17ను బిజెపి విమోచన దినమంటే, కమ్యూనిస్టులు మాత్రం విలీనమంటున్నారు. మరి కొందరు స్వాతంత్య్రమంటున్నారు.
భారతదేశానికి ఆగష్టు 15, 1947న స్వాతంత్య్రం సిద్ధిస్తే, నిజాం సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం విముక్తి లభించలేదు. ఇందులో ఎనిమిది జిల్లాలు తెలుగు ప్రాంతంలోనివి అయితే మరో 5 జిల్లాలు మరాఠ్వాడాలోను, మూడు కర్ణాటక ప్రాంతంలోను ఉండేవి. సుధీర్ఘ పోరాటం అనంతరం అంటే సెప్టెంబర్ 17, 1948న ఎందరో త్యాగధనుల బలిదానాలతో హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో కలిసిపోయి స్వాతంత్ర్యపు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నది.
మైనారిటీలంతా నిజాంకు అనుకూలం కాదు….
వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య సాంఘిక పరమైన, ఆర్థికపరమైన స్థాయిలో పెద్దగా భేదం ఉండేది కాదని తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఉన్న వ్యక్తులు కొందరు మాత్రం ఈ రెండు వర్గాలలోను కూడా ఉండేవారు. కానీ పాలకుడు మహమ్మదీయుడు కావడంతో ఆ వర్గానికి చెందిన వారు అదొక సదుపాయంగా మైనారిటీ వర్గం భావించుకునేవారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముస్లింలు, తమ పౌరులు హిందువులతో సమానంగానే వెనుకబడి ఉండేవారు. మైనారిటీ వర్గాల ప్రజలు నిజాంకు అనుకూలమేమీ కాదు. వారు కూడా నిజాం పాలనలో అణచివేతకు గురైనవారేనని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ముస్లింలలో చదువుకున్న వారికీ, వ్యాపారులకు ప్రత్యేక సౌకర్యాలు లభించేవి. హిందువులలోని కొందరు వ్యక్తులకు కూడా ఈ హక్కులను నిజాం రాజ్యం కల్పించేది. భూస్వామ్య వర్గాలకు చెందిన వీరంతా నవాబుకు అండదండలను ఇచ్చేవారు.
సెప్టెంబర్ 17ను తమ సొత్తుగా భావిస్తున్న బిజెపి….
సెప్టెంబర్ 17ను బిజెపి తమ సొత్తుగా భావిస్తున్నది. హిందూవులు, ముస్లీంల పోరాటంగా బిజెపి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక వర్గం మాత్రమే ఈ పోరాటంలో భాగస్వాములు అన్నట్లుగా అభివర్ణించే ప్రయత్నాలను చేస్తోంది. వామపక్ష పార్టీలు మినహా టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు సైలెంట్‌గా ఉండబట్టే సెప్టెంబర్ 17ను బిజెపి ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రతి ఏడాది ఈ అంశాన్ని సెప్టెంబర్ 17 ముందు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నది. ఆ నాడు నిజాం పాలనలో కేవలం హిందువులు మాత్రమే అణచివేతకు గురికాలేదు. ఇతర మతాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం నిజాం నిరంకుశ పాలకు, రజాకార్ల ఆగడాలకు అణచివేయబడినవారే. సిపిఎం ఇతర కమ్యూనిస్టులు సెప్టెంబర్ 17ను విలీనం దినంగానే చూడాలంటున్నారు. ఇప్పటికీ జమీందార్ల నుంచి ప్రజలకు విమోచనం లభించలేదంటున్నారు. భూస్వామ్య దోపిడీ ఇంకా గ్రామాల్లో కొనసాగుతునే ఉంది. ఒక వర్గం నుంచి మరో వర్గం విమోచనం పొందలేదు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది కాబట్టి సెప్టెంబర్ 17ను విలీన దినంగానే చూడాలని కమ్యూనిస్టులు పేర్కొంటున్నారు. మరికొందరు సెప్టెంబర్ 17ను స్వాతంత్ర్యంగా అభివర్ణిస్తున్నారు. ఇది కూడా సరైంది కాదని కమ్యూనిస్టులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజాం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన రోజుగానే దీన్ని చూడాలంటున్నారు..తప్పితే విమోచనమో…స్వాతంత్రమో, విద్రోహ దినంగా చూడొద్దంటున్నారు.
చరిత్రకు ఆనవాలుగా సెప్టెంబర్17….
సెప్టెంబర్ 17 1948.. పదమూడు నెలల అనంతరం హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమయ్యింది. అయితే హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత యూనియన్‌లో కలవనంటూ మొండికేస్తూ హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. దేశ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ సైన్యాన్ని రంగంలోకి దింపడంతో లొంగిపోతున్నట్లు అసఫ్‌జాహీ వంశస్థులైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియో ద్వారా ప్రకటించడంతో వివాదం సుఖాంతమయ్యింది. అయితే ఎన్ని వేల మంది ప్రాణాలు బలిదానం చేస్తే కానీ తెలంగాణకు విముక్తి లభించలేదు. రజాకార్ల ఊచకోతలతో పేట్రేగిపోతుంటే ఎంతో మంది మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటాలు చేసిన తరువాత హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన స్వాతంత్ర్యం లభించలేదు. రజాకార్లకు ధీటుగా నిలిచిన ప్రతిదాడులకు పాల్పడుతూ నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. ఇలా సెప్టెంబర్ 17 చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. గ్రేటర్లో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఆ తరువాత సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు ప్రకటన చేయడం జరిగింది.
ఎవరికి తోచినట్లుగా వారూ…
రజాకార్ల ఊచకోతలు, మారణకాండలను ఎదురొడ్డి ప్రాణాలు అర్పించి హైదరాబాద్ విముక్తి కోసం శ్రమించారు. ఇందులో కమ్యూనిస్టుల పాత్రం ప్రధానమైంది. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా భారతదేశంలో హైదరాబాద్ కలిసిపోయింది. అయితే రజాకార్ల ఊచకోతలు, మారణకాండ, నిజాం దమననీతి… ఇలా నాటి దురాఘాతాలను స్మరించుకుంటూ ఆయా పార్టీలు, సంస్థలు సెప్టెంబర్ 17ను విముక్తి దినమని. విలీన దినమని, విమోచన దినమని, విద్రోహదినమని పేర్కొంటున్నారు. ఏదేమైనా సెప్టెంబర్ 17 రోజు మాత్రం చరిత్రకు ఆనవాలుగా నిలిచింది.











