చంద్రబాబు వ్యవహారంపై ఢిల్లీ పెద్దలు సీరియస్ గా దృష్టిపెట్టారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో టీడీపీ నేత లోకేశ్ సమావేశమవడం ఆసక్తి రేపుతున్న అంశం. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి హాజరవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సీఎం జగన్ తప్పుడు నివేదికలు, నిర్ణయాలతో ఇన్నాళ్లూ కేంద్రాన్ని, ముఖ్యంగా బీజేపీ నేతలను ఎలా మోసం చేసిందీ ఈ సమావేశం తర్వాత కేంద్రం ఓ అభిప్రాయానికి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో లోకేశ్ చెప్పిదందతా విన్న అమిత్ షా.. జగన్ విషయంలో ఆందోళన వద్దని అంతా తాను చూసుకుంటానని అభయమిచారని సమాచారం. ఆ తర్వాత పురంధేశ్వరి కూడా ఏపీలో జరుగుతున్న కుట్ర రాజకీయాలను, జగన్‌కు దగ్గరవడం వల్ల ఎదురవబోయే నష్టాలను అమిత్ షాకు వివరించారట.
ఇదే సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్న అభిప్రాయాన్ని అమిత్ షాతో స్పష్టంగా చెప్పారట. జగన్ ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు, లోకేశ్, పలువురు టీడీపీ నేతలను అరెస్టులు చేయించటం, కేసులు పెట్టడం చేస్తున్నారని కిషన్ రెడ్డి అమిత్ షాకు వివరించారు. సమావేశమంతా అయిపోయాక కిషన్ రెడ్డి మరో సారి చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నఅభిమానులు, ఆ పార్టీ నేత జైల్లో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళితే ఎదురయ్యే ఇబ్బందులనూ కిషన్ రెడ్డి షాకు వివరించారు.
నవంబర్ 30 జరిగే ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో అందరి దృష్టీబీజేపీ వేపే ఉన్నసమయంలో చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ తెలంగాణ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందన్ని కిషన్ రెడ్డి సూటిగా అమిత్ షాకు చెప్పారట. పైగా చంద్రబాబు అరెస్ట్‌కు తనకూ ఏమీ సంబంధం లేదని ఇదంతా కేంద్రం చేయిస్తోందటూ జగన్, ఆయన పార్టీ నేతలు చెప్పటాన్ని కూడా తప్పుబట్టిన కిషన్ రెడ్డి ఈ అంశాన్నీ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి అపవాదును మోస్తూ ఓట్లేయండంటూ తెలుగుదేశం పార్టీ అంటే అభిమానమున్న జనంలోకి వెళ్లడం కరెక్ట్ కాదేమోనని కిషన్ రెడ్డి అమిత్ షాకు వివరించారట. మొత్తానికి రెండు రాష్ట్రాల అధ్యక్షుల నివేదికలు, వివరణలు పరిశీలించాక అమిత్ షా జగన్ విషయంలో తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.











