ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై చేసిన ఆసక్తికరమైన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియాలో పేదరికం వేగంగా తగ్గుముఖం పడుతోందంటూ వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన రిపోర్టుపై స్పందించిన ఆయన, పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న నాంది ఫౌండేషన్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. 28 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు చూపిన చొరవతోనే ఈ సంస్థ రూపుదిద్దుకుందని మహీంద్రా స్పష్టం చేశారు.
నాంది ఫౌండేషన్ 28వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆనంద్ మహీంద్రా, ఈ సంస్థ స్థాపనకు అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడే అని తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు దివంగత డాక్టర్ కే. అంజిరెడ్డిని ఈ సంస్థకు వ్యవస్థాపక ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాల్సిందిగా చంద్రబాబే ఒప్పించారని వివరించారు. ఆ తర్వాత డాక్టర్ అంజిరెడ్డి విజ్ఞప్తి మేరకు తాను ఈ సంస్థలో భాగస్వామినయ్యానని, నాటి నుంచి నేటి వరకు ఈ ప్రయాణంలో పనిచేయడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.
2011 నుండి 2023 మధ్య కాలంలో భారతదేశంలో దాదాపు 49.6 కోట్ల మంది అత్యంత వేగంగా పేదరికం నుంచి బయటపడ్డారని బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన వరల్డ్ బ్యాంక్ కథనాన్ని తన ట్వీట్లో ఆనంద్ మహీంద్రా ప్రస్తావించారు. అలాగే అమెరికాకు చెందిన ప్రసిద్ధ ప్రిడిక్షన్ మార్కెట్ వేదిక Kalshi కూడా భారత్‌లో తీవ్రమైన పేదరికం దాదాపు 0%కి పడిపోయిందని పేర్కొన్న విషయాన్ని ఆధారాలతో సహా ట్వీట్లో ప్రస్తావించారు.
పేదరికం అనేది కేవలం ఆదాయం లేకపోవడం మాత్రమే కాదని, అవకాశాలు, ఆత్మవిశ్వాసం కొరవడటమేనని మహీంద్రా అభిప్రాయపడ్డారు. నాంది ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 1 కోటి మంది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చామని, 5 లక్షల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని చెప్పారు. అరకు కాఫీ , నాన్హి కలీ వంటి ప్రాజెక్టులతో గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయం, మహిళా సాధికారత ద్వారా తెచ్చిన మార్పును చూపే ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. చంద్రబాబు నాటి విజన్ ఈరోజు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిందని మహీంద్రా కొనియాడారు.











