అనూప్‌రూబెన్స్.. ప్రతిభ ఉన్న యువ సంగీత దర్శకుడు. తేజ దర్శకత్వం లో వచ్చిన ‘జై’ సినిమాతో అనూప్‌రూబెన్స్ సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. తెలుగులో అనేక సినిమాలకు సంగీతం అందించిన అనూప్.. అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలోని ప్రతి పాట ఒక ఆణిముత్యంలా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది . అక్కడి నుండి ఆయన అసలు ప్రయాణం మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు, గోపాల గోపాల’ లాంటి సినిమాలతో ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారాయన. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన తాజా చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. రాజ్‌తరుణ్, మాళవికానాయర్ జంటగా నటించిన ఈ చిత్రం రేపే ఆహా ఓటీటీ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అనూప్ రూబెన్స్ పాత్రికేయులతో ముచ్చటించారు.
ఈ చిత్ర విషయాలను ఆయన మాటల్లోనే.. ‘వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒకలైలా కోసం’ తర్వాత దర్శకుడు విజయ్‌కుమార్ కొండాతో నేను చేసిన మూడో సినిమా ఇది. ఆద్యంతం వినోదాన్ని పంచుతూనే భావోద్వేగానికి లోనుచేస్తుంది. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ఇందులో నేను స్వరపరచిన పాటల్లో ‘ఈ మాయ పేరేమిటో’ గీతం వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చింది. తెలుగులో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం సంతృప్తికరంగా సాగుతోంది. మాస్, క్లాస్, రొమాన్స్, యాక్షన్ లాంటి భిన్నమైన జోనర్స్‌కు సంగీతాన్ని అందించే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా కోసం నేను స్వరపరచిన ‘నీలి నీలి ఆకాశం’ పాటకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. నా సినీ ప్రయాణంలోనే మరపురాని పాట ఇదంటూ ప్రతి ఒక్కరూ చెబుతుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక బాలుగారి విషయానికి వస్తే నా స్వరసారధ్యంలో ఎక్కువగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. బాలు గారి మరణంతో తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయిన భావన కలుగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఏడు నెలల పాటు మనుషులెవరూ లేని ఏకాంత ప్రదేశంలో బందీ అయిపోయినా ఫీలింగ్ కలిగింది. ప్రీరిలీజ్ వేడుకతో మళ్లీ అందరి ముందుకు రావడం ఆనందంగా అనిపించింది‘ అని తన మనసులోని మాటలను అనూప్ తెలిపాడు.











