ఆంద్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఆకాశంలో ఉన్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా జరుగుతున్న స్మగ్లింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో దాదాపుగా ప్రతిరోజూ రాష్ట్రానికి ఉండే అన్ని సరిహద్దులవైపునా.. కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయినా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రాలనుంచి ఒక్కో వ్యక్తి మూడు బాటిళ్ల వరకు తెచ్చుకోవచ్చునంటూ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. మూడు సీసాలకు అనుమతి ఉంటుందని.. కేసులు తగవని తీర్పు చెప్పింది. ప్రభుత్వ చట్టంలోని వెసులుబాటును గుర్తు చేసింది.
అక్రమార్కులకు ఇది వరమైంది
ఒక రకంగా చెప్పాలంటే ఈ వెసులుబాటు కూడా స్మగ్లర్లను అక్రమార్కులను ప్రోత్సహించేలాగానే తయారైంది. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే మార్గాల్లో రోడ్డు పక్కన మద్యం చిల్లర దుకాణాలు వెలిశాయి. ఎంతలా అంటే.. రోడ్డు పక్కన చిన్న స్టూలు మీద పెట్రోలు సీసాలు ఉంచి అమ్మే తరహాలో.. రోడ్డు పక్కన వరుసగా చిల్లర దుకాణాలు, పాన్ డబ్బాల వంటివి పెట్టుకుని, వాహనదారుల్ని ఆకర్షించేలా స్టూలు మీద స్కాచ్ విస్కీ సీసాలు ఉంచి విక్రయించడమూ జరుగుతూ వచ్చింది. ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి కూడా.
ఇలాంటి అక్రమార్కులంతా హైకోర్టు తీర్పును అడ్డంగా వాడుకున్నారు. టూవీలర్ మీద వెళుతున్న వారు అడిగినా.. సరే మూడు బాటిళ్లకు మించి విక్రయించేది లేదంటూ పద్ధతి పాటించారు. ఇద్దరున్నాం కదా.. ఆరుసీసాలు ఇవ్వమంటే.. లేదు లేదు.. ఒక్కో బండికి మూడు సీసాలు మాత్రమే అంటూ జాగ్రత్త పడ్డారు. ఇలాంటి లొసుగుల కారణంగా.. యథేచ్ఛగా స్మగ్లింగ్ జరుగుతూ వచ్చింది.
తాజాగా ఏపీ సర్కారు కొత్త ఉత్తర్వులతో ఈ దందాలకు కూడా చెక్ పెట్టింది. ఇతర రాష్ట్రాలనుంచి మద్యం తేవడాన్ని పూర్తిగా నిషేధించింది. అనుమతిలేకుండా తెస్తే కఠిన శిక్షలుంటాయన్నారు. పాత నిబంధనల ప్రకారం మూడు సీసాల మద్యం తెచ్చుకునే వెసులుబాటును కూడా తొలగించారు. ఇతర దేశాలనుంచి తెచ్చే మద్యాన్ని మాత్రం కేంద్ర నిబంధలన మేరకు అనుమతిస్తారు.
లక్ష్యం నిషేధమే అయితే మంచిదే
లిక్కర్ ధరలను అడ్డగోలుగా పెంచడం వెనుక ప్రభుత్వం అధికాదాయం కోసం చూస్తున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఇలాంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు హామీ ఇచ్చిన సంపూర్ణ మద్యనిషేధం దిశగా అడుగులు పడితే మంచిదే. అలా కాకుండా.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు సొంత మనుషులైన చీప్ లిక్కర్ తయారీదార్లను ప్రోత్సహించడానికి, వారికి లాభం చేకూర్చడానికి చేసే పనులైతే మాత్రం సమర్థించలేం.
అధిక ధరలు అనేవి.. వైసీపీ నేతలు సాగించే స్మగ్లింగ్ దందాకు బాగా ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి. చిన్న స్మగ్లర్లు, ప్రభుత్వ లొసుగుల్ని వాడుకుని రాజమార్గంలో తెచ్చుకునే మూడు సీసాలకు చెక్ పెట్టాలని చూస్తున్న ప్రభుత్వం.. దొంగ మార్గాల్లో కేసుల కొద్దీ మద్యం అక్రమంగా తరలించే వారిమీద మరింత ఫోకస్ పెట్టాలి. మరిన్ని కఠినమైన చట్టాలు తేవాలి. వైసీపీ నాయకులే స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపించకుండా ఉండేలా.. తమ పార్టీ వారు పట్టుబడినా.. దందా సాగిస్తున్నా కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతారు. లేకపోతే వక్ర ఉద్దేశ్యాలను ఆపాదిస్తారు.