విజయవాడ టీడీపీ నేతల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ, నాగుల్ మీరా మరోసారి ఎంపీ కేశినేని నానిపై ఫైర్ అయ్యారు. నేను ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని అంటూ ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గత కొన్నాళ్లుగా ఎంపీ కేశినేని నాని వ్యవహారశైలితో విసిగిపోయి మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని బుద్దా వెంకన్న చెప్పారు. ఇలా రావడం తమకెంతో బాధగా ఉందన్నారు. చంద్రబాబును ఏక వచనంతో సంభోదించిన రోజే కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినని, అయితే చంద్రబాబుపై ఉన్న గౌరవంతో వదిలేశానని బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని స్థాయి దాటి వ్యవహరిస్తున్నాడని…దుమ్ముంటే రా.. నువ్వో నేనే తేల్చుకుందామంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.
టీడీపీ అంటే కేవలం ఒక సామాజిక వర్గం కాదు..
రంగా హత్య కేసులో ప్రధాన నిందితులను వెంట వేసుకుని ప్రచారంలో కేశినేని నాని తిరుగుతున్నాడని బోండా ఉమ ఆరోపించారు. టీడీపీ అంటే కేవలం ఒక సామాజిక వర్గం కాదని, బీసీల పార్టీ అని బోండా గుర్తు చేశారు. కేశినేని నాని బీసీలను టీడీపీకి దూరం చేసే కుట్ర చేస్తున్నాడని బోండా ఉమ విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 22 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని నాగుల్ మీరా గుర్తు చేశారు. అలాంటిది కేశినేని నాని విజయవాడ పశ్చిమలో పార్టీ కోసం పనిచేసే వారికి టిక్కెట్లు రాకుండా చేశాడని నాగుల్ మీరా విమర్శించారు. ముగ్గురు నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కేశినేని నానిపై విమర్శలు చేయడంతో విజయవాడలో హాట్ టాపిక్‌గా మారింది.
Must Read ;- విజయవాడ టీడీపీలో రచ్చ కెక్కిన విభేదాలు.. అరికట్టక పోతే దిగులే