ఎన్టీఆర్ స్పూర్తితో టీడీపీ శ్రేణులు ముందుకు..
తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామరావు అని తెలుగుదేశ పార్టీ అధినేత చంద్రబాబు కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. ఆయనిచ్చిన స్పూర్తితోనే పార్టీ శ్రేణులు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కథానాయకునిగా, మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళుర్పిస్తున్నట్లు చంద్రబాబు ట్విటర్ ద్వారా తెలిపారు.
సవాలునూ సంచలన విజయంగా మార్చుకున్న మహానేత!
తనకు ఎదురైన ప్రతి సవాలునూ సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి.. వంటివి ఎన్టీఆర్ ఆయుధాలని కొనియాడారు. అందుకే ఆయన ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకుని వ్యవస్థలను సంస్కరించగలిగారని, తెలుగు జాతి ముద్దు బిడ్డడు కాగలిగారని పునరుద్ఘాటించారు లోకేశ్. ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆ మహానుబావుని స్మృతికి అంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు. అలానే ఎన్టీఆర్ ను భారతరత్న తో గౌరవించాలని ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అనంతరం ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మహానేత ఎన్టీఆర్ కు టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు.











