నర్సాపురంలో తిరుగులేని మేజారిటీతో రఘురామ గెలుపు ఖాయం..!
పశ్చిమ గోదావరి జిల్లా నర్పాపురం పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు వస్తే.. రఘురామ గెలుపు ఖాయమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంపీ రఘురామ గత కొంతకాలంగా రచ్చబండ వేదికగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తున్న రాజకీయ విమర్శలపై సుధాకర్ రెడ్డి తన సోషల్ మీడియాలో విశ్లేషించారు. అధికార వైసీపీలో రఘురామ కొరకరాని కొయ్యగా మారాడని, అక్రమ కేసులు పెట్టి లొంగదీసుకోడం వంటి చర్యలు కూడా కుదరడం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇదే అదునుగా రఘురామ తన ఎంపి పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. తనపై అనర్హత వేటు వేయడం జగన్ కు చేత కాకుంటే తానే రాజీనామా చేసి పోటీ చేస్తానని, దమ్ముంటే జగనే తమపై పోటీ చేయవచ్చని వెటకారం సవాలు విసిరారు. ఆయన అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ రాజీనామా చేస్తానని గతంలోనే ప్రకటించిన విషయాన్ని సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాజు రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చలు, విశ్లేషణలు జోరందుకున్నాయి. గతంలో ఆ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు, గెలిచిన పార్టీలు, గెలిచిన వారి సామాజిక వర్గాలు లాంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఏ కోణంలో చూసినా రఘు రామకృష్ణ రాజు రెండు, మూడు లక్షల మెజారిటీతో గెలుపు ఖాయమన్నట్లుగా కనిపిస్తోందని చెప్పారు.
పార్టీల బలబలాలు, గెలుపును నిర్ధేశించే అంశాలు..!
ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రతినిధ్యం వహించే నర్సాపురం పార్లమెంట్ కు 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరుగగా అందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టిడిపి, రెండు సార్లు బిజెపి, కమ్యూనిస్టులు, వైకాపా అభ్యర్ధులు ఒక్కోసారి గెలిచారు. సామాజిక వర్గం ప్రకారం చూస్తే 12 సార్లు రాజులు, నాలుగు సార్లు కాపులు గెలిచారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే బిసిలు, కాపులు, రాజులు ఎక్కువగా మద్దతు ఇచ్చే టిడిపి, జనసేన, బిజెపి పార్టీల మద్దతుతో పోటీ చేస్తే రఘు రామకృష్ణ రాజు గెలుపు నల్లేరుపై నడకలా సాగిపోతుంది అనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికల్లో వైకాపా అభర్ధిగా పోటీ చేసిన రఘురామ రాజుకు 4,47,594 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్ధి వెంకట శివరామ రాజుకు 4,15,685 ఓట్లు పోలయ్యాయి. దీంతో రాజు 31,909 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి నాగబాబుకు 2,50,289 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుకు 13,810 ఓట్లు, బిజెపి అభ్యర్ధి మాణిక్యాల రావుకు 12,378 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టిడిపి, జసేసన, బిజెపి ఓట్లు కలుపుకుంటే వైకాపా కంటే 2,30,758 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రఘు రామ స్వతంత్రంగా పోటీ చేసినా లేక ఏదైనా పార్టీ అభ్యర్థిగా బరిలో దిగినా.. ఈ మూడు పార్టీల మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇక్కడ కాపు, రాజు లేదా బీసీ సామాజిక వర్గంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. అయినా ఆయా సామాజిక వర్గాల ఓటర్లు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాల వల్ల ఇతర సామాజిక వర్గాల ఓటర్లు జగన్ కు దూరమవుతున్నారు. ఇక్కడ మెజారిటీ ఓట్లు ఉన్న సామాజిక వర్గాలు అన్నీ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. రఘురామ రాజును పార్టీ నుంచి బహిష్కరించడమే మేలని భావిస్తే.. జగన్ తెలివిగా వ్యవహరించి పరువు నిలుపు కుంటారా ? లేక మొండిగా వ్యవహరించి పరాభవం చవి చూస్తారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందేని సుధాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.