కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా చేతికి వేస్తున్న క్వారంటైన్ స్టాంపు గుర్తు కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండడంతో ఇతర దేశాల నుంచి ఇండియాకు రాకపోకలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. అయితే ఇలా వస్తున్నవారిని ఎయిర్‌పోర్టులో అక్కడి సిబ్బంది గుర్తించి థర్మల్ స్క్రీనింగ్ చేసి, క్వారంటైన్ స్టాంప్ వేసి పంపిస్తున్నారు. ఈ నిబంధనలే ఇప్పుడు కొత్త అనారోగ్య సమస్యలను తీసుకొస్తున్నాయి.
మధుయాష్కి చేతికి బొబ్బలు..
శనివారం అమెరికా నుంచి ఢిల్లీ వచ్చిన నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కికు విమానాశ్రయంలో వేసిన క్వారంటైన్ స్టాంప్ బొబ్బలు పుట్టించింది. చేతిపై వాతలు పెట్టినట్లుగా బొబ్బలు రావడం ఆయనకు ఆందోళన కలిగించింది. బొబ్బలతో కూడిన మంటలు రావడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
భువనేశ్వర్, నాగ్‌పూర్‌లో కూడా..
అమెరికా నుంచి ఢిల్లీలో విమానం దిగిన మధుయాష్కికి భద్రతా సిబ్బంది ఆయన చేతిపై మూడు స్టాంపులు వేయడంతో అక్కడ మంటగా మొదలైంది. అది సాధారణమే అనుకొని కాసేపు ఆయన నొప్పిని ఓర్చుకున్నారు. ఎంతకీ తగ్గకపోవడంతో చల్లనీ నీళ్లతో చేయిని తడిపి, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయలుదేరి వచ్చారు. అప్పటికే చేతికి బొబ్బలు ఎక్కువవడంతో వెంటనే ఆయన డాక్టరుకు చూపించుకొని చికిత్స చేయించుకున్నారు. ఆదివారం ఉదయానికి కొంత మంట తగ్గినప్పటికినీ బొబ్బలు మాత్రం తగ్గకపోవడంతో ఆయన ఆందోళన చెందారు.
స్టాంప్ వేసిన సిరాలో ఏమైనా లోపం ఉందోనని ఆయన అనుమానం వ్యక్తం చేసి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మధుయాష్కి ట్వీట్‌కు కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ స్పందించారు. ఎయిర్పోర్ట్ సిబ్బందితో మాట్లాడానని ఆయనకు బదులిచ్చారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆ సిరాను పక్కన పెట్టి, పరీక్ష కోసం పంపుతామని పేర్కొన్నది. భువనేశ్వర్, నాగ్‌పూర్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు పలువురు ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నట్లు తెలిసింది. గతంలో చెన్నై విమానాశ్రయంలోనూ ఇలాంటి ఫిర్యాదులే నమోదయ్యాయి. ముందు జాగ్రత్తగా వేస్తున్న స్టాంపులు కొత్ అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.











