కరోనా పుణ్యమా అని ప్రాచీన వైధ్యానికి పూర్వవైభవం వచ్చింది వంటింటి ఆయుర్వేద చిట్కాలకు పదును పెడుతున్నారు . రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆయుర్వేద వైద్య విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేచర్ క్యూర్ ఆసుపత్రిని కరోనా క్వారెంటైన్ సెంటర్ గా మార్చింది. ఇక్కడ సంప్రదాయ పద్ధతిలో చికిత్సనందిస్తూ.. వేలాది మందిని కరోనా రక్కసి నుంచి కాపాడారు. బడా బడా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళినా బతికి బట్టకడతామా లేదా? అన్న అనుమానం ఉండేది. కానీ నేచర్ క్యూర్ లో చికిత్స అందితే కచ్చితంగా కరోనాను జయించవచ్చన్న నమ్మకం ఏర్పడింది. దీంతో ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి లో ప్రభుత్వ పెద్దలు , టీఆర్ఎస్ లో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న వారు సైతం నేచర్ క్యూర్ లో బెడ్స్ కోసం రెకమండేషన్ చేసుకునే వారు.
ప్రాచీన వైద్యం..అదో అద్భుతం…
నేచర్ క్యూర్ కు భారీగా డిమాండ్ రావడం, భాతర దేశ ప్రాచీన వైద్యం చేసిన అద్భుతాలతో ప్రజాదరణ మళ్ళీ పెరిగింది . రాష్ట్రంలో ఆయుర్వేదిక్ పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. భారతీయ ప్రాచీన వైద్య విధానానికి పూర్వ వైభవం తెచ్చేందుకు అవసరం అయిన అన్నిచర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. కరోనా సమయంలో ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద సెంటర్ గా మారిందని… వ్యాధి నిరోదక శక్తి పెంచుతున్న ఆయుష్ మందులను మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు . ఇన్నాళ్ళూ చాలా కొద్ది మందికి మాత్రమే పురాతన వైద్యంతో అనుబంధం ఉండేది.. కానీ కరోనా నేపథ్యంలో ఇప్పుడు అందరి వైద్యంగా మారిపోయింది.
ఆయుష్ విద్యార్థులకు గుర్తింపేదీ?
ఇప్పటిదాకా ఆయూష్ లో ఉన్న విభాగాల్లో విద్యార్థులు ఐదు సంవత్సరాలపాటు చదువుతున్నప్పుడు వారికి గుర్తింపు, గౌరవం లభించేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ లోటును పూరించి వారికి గౌరవం దక్కేలా చూడాలి. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి కూడా. ఆయుర్వేద, యునానీ, హోమియో, నాచురోపతి , యోగా అన్ని విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్ట్ ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇకపై అవి వెల్ నెస్ సెంటర్లు…
ఆయుష్ డిస్పెన్సరీ సెంటర్లను వెల్ నె స్ సెంటర్లుగా మార్చడంతో పాటు … ప్రస్తుతం 440 ప్రభుత్వ డిస్పెన్సరీలు, 394 NRHM డిస్పెన్సరీలు పని చేస్తుండగా.. తక్కువ పేషంట్లు వస్తున్న డిస్పెన్సరీలన్నిటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించనుంది. పీహెచ్ సీ లోనే ఆయుష్ విభాగాలు కూడా ఉండేలా చూడాలని కోరింది. ఆయుష్ అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి నివేదిక తయారు చేయాలని సూచించింది.
అంతరించే ప్రమాదంలో ఆయుర్వేదం…
దశాబ్దాల కాలంగా ప్రజల ప్రాణాలకు అండగా నిలిచిన ఆయుర్వేద వైద్యం ప్రమాదం అంచున ఉంది. మరి కొన్నాళ్ళయితే ఈ మాత్రం రోగులు కూడా వచ్చేది కూడా అనుమానమే. సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం సంప్రదాయ వైద్యానికి పెద్ద పీఠ వేయడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అల్లోపతిలో కూడా నయం కాని రోగాలకు ఆయుర్వేదిక్ వైద్యంలో చికిత్స ఉందని, ఆయుర్వేదానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతీయ వైధ్యాన్ని కాపాడుకున్న వారమవుతామని భావిస్తున్న తెలంగాణ సర్కార్ యోచన కార్యరూపం దాలుస్తుందో… కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందో చూడాలి.










