చంద్రబాబు.. స్టేట్.. నేషనల్.. కాదు ఇంటర్నేషనల్. అంతర్జాతీయ మీడియా సంస్థ.. ప్రపంచంలోనే టాప్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇదే చెబుతోంది. నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి పదవి రేసులో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని రాయిటర్స్ అంచనా. ఇదే అంశంపై నేషనల్ మీడియాలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పట్లో మోడీ రాజకీయాల నుంచి తప్పుకొనే అవకాశం లేదు. ప్రధానమంత్రి పదవిని వదులుకొనే సూచనలూ లేవు. అయినా మోడీకి 75 సంవత్సరాలు దాటడంతో.. ఆయన వారసులు ఎవరు అనే చర్చ కొనసాగుతూనే ఉంది..
రాయిటర్స్ కథనం ప్రకారం మోడీ తర్వాత ఫస్ట్ ఆప్షన్ అమిత్‌షా. కేంద్ర హోంమంత్రి, బీజేపీలో మోడీ తర్వాత నెంబర్ టు స్థానంలో ఉన్న అమిత్‌షా.. సహజంగానే మోడీకి వారసుడు అవుతారని ఎక్కువమంది అభిప్రాయం. ఒకవేళ అమిత్‌షా కాకపోతే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రైమ్ మినిస్టర్ పదవి దక్కే ఉందట. బీజేపీ మిత్ర పక్షాలకు అవకాశం దక్కినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు లేకపోతే ఆయన కుమారుడు నారా లోకేశ్.. ప్రధానమంత్రి సీట్లో కూర్చొనే అవకాశం ఉందని రాయిటర్స్ విశ్లేషించింది..
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు.. తనకు ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని గతంలోనూ.. ఈ మధ్య కాలంలోనూ స్పష్టంగా తేల్చి చెప్పారు. అయినా రాయిటర్స్ కథనంలో ఆయన పేరు రావడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. రాయిటర్స్ అమెరికా నుంచి పని చేసే న్యూస్ ఏజెన్సీ. పశ్చిమ దేశాలకు ఇండియాలో బీజేపీ అధికారంలో ఉండటం.. మోడీ ప్రధాన మంత్రిగా ఉండటం ఇష్టం లేదు. ఆ విషయాన్ని అమెరికా, యూరోపియన్ దేశాల నేతలు ఓపెన్‌గానే చెబుతారు. ఈ కారణంతోనే అమిత్ షా తర్వాత యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఉన్నా.. ఆయన పేరు చెప్పలేదు. హిందూత్వ పాలిటిక్స్ జోలికి పోకుండా.. ఆర్ధిక సంస్కరణలు చేసే ఫ్యూచరిస్టిక్ నాయకులు భారత ప్రధానిగా ఉండాలనేది అమెరికా దాని మిత్ర దేశాల ఆకాంక్ష. అందుకే పెట్టుబడుల సాధన, అభివృద్ధి మీద ఫోకస్ చేసే దేవేంద్ర ఫడ్నవీస్, నారా చంద్రబాబు, నారా లోకేశ్‌లు రాయిటర్స్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ లిస్టులో చోటు దక్కించుకొన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు..











