జగన్ హయాంలో ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితికి చేరిన పోలవరం ప్రాజెక్టు.. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కడమే కాదు.. వేగంగా పనులు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన చోటే.. చంద్రబాబు సర్కారు.. ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది. వరదలతో డ్యామేజ్ అయిన డయాఫ్రం వాల్‌ని కొత్తగా నిర్మిస్తున్నారు. కాఫర్ డ్యాం లీకేజీలను అరికట్టడానికి బట్రెస్ డ్యాం నిర్మాణం జోరుగా సాగుతోంది. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు అధారిటీ కొత్త సీఈవో యోగేశ్ పైథాంకర్.. స్వయంగా రంగంలోకి దిగారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వాసితులకు రెండు విడతల్లో 2 వేల కోట్లు చెల్లించారు. వచ్చే ఏడాది కాలంలో.. 41.5 మీటర్ల స్థాయిలో మునిగిపోయే ప్రాంతాల ప్రజలకు పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం 25 వేల కోట్లు కేటాయించడంతో.. ప్రధాన డ్యాం పనులతో పాటు.. నిర్వాసితులకు పరిహారం అందించడానికి వెసులుబాటు కలిగింది.
కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రంవాల్ పనులు 83 శాతం పూర్తయ్యాయి. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం వర్క్ 14 శాతం జరిగింది. డయాఫ్రం వాల్‌తో పాటు ప్రధాన డ్యాం పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం 2020 నాటికే ప్రాజెక్టుని ప్రారంభించాలని ప్రయత్నించింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్ల పేరుతో పనులు ఆపేశారు. తర్వాత వచ్చిన వరదలతో ముఖ్యమైన స్ట్రక్చర్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జగన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక.. విదేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి.. ప్రాజెక్టులో జరిగిన డ్యామేజీలను రిపేర్ చేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో.. పనులు ప్రారంభించి.. వేగంగా పూర్తి చేస్తున్నారు. మాటల ప్రభుత్వానికి.. చేతల ప్రభుత్వానికి ఎంత తేడా ఉంటుందో చెప్పడానికి.. పోలవరం పనులే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.











