సంక్రాంతికి మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది కూటమి సర్కార్. గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయిలో 70కిపైగా అన్న క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అన్న క్యాంటీన్ల నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు.
జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పట్టణ ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. రోజూ వీటిలో మూడు పూటలా కలిపి 2 లక్షల మందికిపైగా ప్రజలు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. పూటకు రూ.5కే ఆహారం సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం మరో 70 క్యాంటీన్లను మంజూరు చేసింది
ఇప్పటివరకూ నగరాలు, పట్టణాల్లో ప్రారంభించిన 205 క్యాంటీన్లలో ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు. వీరిలో అత్యధికంగా 3.16 కోట్ల మంది మధ్యాహ్న భోజనం చేశారు. ఉదయం అల్పాహారం 2.62 కోట్లు, రాత్రిఅల్పాహారం 1.42 కోట్ల మందికి సరఫరా చేశారు. విశాఖపట్నం, NTR, గుంటూరు జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో పేదలు లబ్ధి పొందుతున్నారు.











