కాలి నడకన తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకొంటే గోవిందుడి కరుణా, కటాక్షాలు లభిస్తాయని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే వెంకటేశ్వర స్వామి సన్నిధి చేరుకోవడానికి బస్సులు, కార్ల వంటి వాహనాల కంటే కాలి నడకనే వేలాది భక్తులు.. ఏడుకొండలు ఎక్కుతారు. నడక మార్గంలో కొండెక్కాలంటే ఎంతో శ్రమపడాలి, గంటల తరబడి నడవాలి. ఈ ప్రయాణంలో నీరసం, నిస్సత్తువ లేక ఇతర కారణాలతో.. అనారోగ్యం బారిన పడే వారి కోసం.. తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే మార్గంలో ప్రాథమిక చికత్స కేంద్రాన్ని ప్రారంభించారు. వాహనాల్లో వెళ్లేటప్పుడు దిగువ ఘాట్ రోడ్డులో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. అత్యవసర సమయంలో భక్తులకు వైద్య సేవలు అందించడానికి ఈ డిస్పెన్సరీని ఏర్పాటు చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఇప్పటికే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడుస్తోంది. నడక మార్గంలో ప్రతి రోజు 20 నుంచి 30 వేల మంది భక్తులు.. తిరుమల కొండపైకి వెళ్తారు.
శ్రీనివాస మంగాపురం దగ్గర మొదలయ్యే శ్రీవారి మెట్టు మార్గంలో 2 వేల 400 మెట్లు ఉంటాయి. ఈ దారి నిట్ట నిలువుగా ఉన్నా.. దూరం మాత్రం రెండు కిలోమీటర్లే ఉంటుంది. ఫిట్‌నెస్‌ని బట్టి ఈ రూట్‌లో రెండు నుంచి మూడు గంటల్లో కొండపైకి చేరుకోవచ్చు. ఇక అలిపిరి వద్ద ప్రారంభమయ్యే మరో నడక దారిలో 3 వేల 550 మెట్లు ఉంటాయి. ఈ మార్గంలో.. మెట్ల మధ్యలో కొన్ని చోట్ల రోడ్డు కూడా ఉంటుంది. అయితే అలిపిరి దారిలో కొండమీదకు దూరం సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిలో ఏడు కొండలు ఎక్కాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు గంటలకు మించి నడవాలి. నడక దారిలో శ్రీవారి సన్నిధికి వెళ్లాలనుకొనే వారు ఈ దూరాన్ని, భారాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఫిట్‌నెస్ లెవెల్స్ అంచనా వేసుకొని.. తిరుమల టూర్ ప్లాన్ చేసుకొంటే మంచిది.











