తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన దుబ్బాక ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. ఇప్పటికే గెలుపు పై ధీమాగా తెరాస ప్రభుత్వం తన ప్రణాళికలను మరింత వ్యూహత్మకంగా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి హారీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు.
అసలు భాజపా నేతలు ఏ హక్కుతో దుబ్బాకలో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. నేను పక్కా తెలంగాణ పౌరుడిని. నేను అడిగే ప్రశ్నలలో ఒక్కదానికి అయినా బండి సంజయ్ దగ్గర సమాధానాలు ఉన్నాయా అంటూ ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాగానే 7 మండలాలను ఆంధ్రాకు అప్పగించింది భాజపా ప్రభుత్వం కాదా? అతి తక్కువకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే లోయర్ సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాకు అప్పగించింది భాజపా ప్రభుత్వం కాదా? విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకుండా మోసం చేయలేదా? యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును భాజపా ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకుంది? కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసింది భాజపా కాదా? రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడిచినా తెలంగాణకు న్యాయమైన నీటి పంపకాలు చేయకుండా అన్యాయం చేస్తోంది భాజపా కాదా? అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు.
అంతేకాకుండా ఆంధ్రాతో పాటు దేశంలోని అనేక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఏర్పడినా ఆంధ్ర విద్యుత్ ఉద్యోగులు 1153 మంది ఇంకా ఇక్కడే ఎందుకు పని చేస్తున్నారు. దీని వల్ల ఏటా రూ.1000 కోట్ల భారం పడుతుంది. ఆంధ్రా ఉద్యోగులను పంపకుండా ఎందుకు తాత్సరం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో 39.5 లక్షల మందికి 2,016 రూపాయల పెన్షన్ ఇస్తుంటే.. కేంద్రం ఎందుకు 6 లక్షల మందికి రూ.200 పెన్షన్ ఇస్తోంది?
కేంద్రం దేశ వ్యాప్తంగా 100 విమానాశ్రయాలు కడుతుంటే.. అందులో తెలంగాణకు అవకాశం లేదు. వరంగల్ మామునూర్ లో నిజాం హయంలోనే విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు అది ఎందుకు ముందుకు కదలలేదు?
దేశ వ్యాప్తంగా టెక్స్ టైల్ రంగ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ..ప్యాకేజీలు ఇస్తున్న కేంద్రం వరంగల్ లో నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్కుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? ఆదిలాబాద్ లో గెలిస్తే సీసీఐని తిరిగి తెరుస్తాం అన్నారు.
కేంద్రంలో ప్రభుత్వం గెలిచి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఎందుకు తెరవలేదు? ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసినా.. కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? తెలంగాణకు మొత్తం రావాల్సిన రూ.12 వేల కోట్లు ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించడం లేదా? అని హారీశ్ తనదైన శైలిలో ప్రశ్నలు వర్షం కురింపించారు. తాను రాసిన బహిరంగ లేఖ పై బండి సంజయ్ త్వరగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు మీడియా ముందు పేర్కొన్నారు.











