ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన సందర్భాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అన్ని ఓకే అయ్యాక.. ప్రయాణానికి కాస్త ముందుగానే ఢిల్లీ టూర్ గురించి వివరాలు వెల్లడించటం అలవాటు. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం ప్రధానితో భేటీ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న వైనాన్ని మీడియాకు సీఎంవో వెల్లడించటం వెనుక ఆసక్తికర అంశం ఉందని చెప్పాలి.
ఏ పని ఉత్తినే జరగదు. అందునా రాజకీయాల్లో చోటు చేసుకునే ప్రతి పరిణామానికి చాలానే లెక్కలు ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా తాజా ఉదంతానని చెప్పాలి. ప్రధానితో భేటీ అయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అందుకు పీఎంవో సానుకూలంగా స్పందించే అవకాశం తక్కువన్న మాట వినిపిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కారుకు కేంద్రం షాకుల మీద షాకులు ఇస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. పోలవరం మీద విపరీతమైన ఆరోపణలు చేసేవారు. ప్రాజెక్టు ఖర్చు పెరిగిన వాస్తవాలపైనా నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ ఆరోపణలు చేసేవారు.
తన మెడకే చుట్టుకుంటున్నాయి..
అప్పట్లో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే ఇప్పుడు శాపాలుగా మారాయన్న విమర్శ పలువురి నోటి నుంచి వస్తోంది. రాజకీయ ప్రయోజనం కోసం సవాలక్ష చేయొచ్చు కానీ.. రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేసే అంశాల్ని టచ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జగన్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆయనకే ఇబ్బందిగా మారిందంటున్నారు. విపక్ష నేతగా పోలవరం మీద తాను చేసిన ఆరోపణలు.. ఇప్పుడు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో ఆయన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేంద్రంతో మిత్రుడిగా వ్యవహరిస్తున్నప్పటికి.. ఏపీ ప్రయోజనాల్ని కాపాడలేని రీతిలో ముఖ్యమంత్రి తీరు ఉందన్న విమర్శలు పెరుగుతున్నాయి.అందుకే.. తాజాగా ప్రధానికి రాసిన లేఖను మీడియాకు విడుదల చేయటం వెనుక అసలు ఉద్దేశమని చెబుతున్నారు.
పనిలో పనిగా ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారాన్ని ఇవ్వటంలోనే లెక్కలు ఉన్నాయని చెప్పక తప్పదు. పోలవరం ఇష్యూ మీద టైం అడిగితే.. ఇచ్చేంత అమాయకుడేం కాదు ప్రధాని. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలో ఇప్పటికే పలు కొర్రీలు పెట్టిన కేంద్రం.. రానున్న రోజుల్లోనూ అదే తీరును ప్రదర్శించినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇలాంటివేళ.. ఇదే ఇష్యూ మీద మాట్లాడటానికి ఏపీ సీఎం వస్తుంటే.. స్వాగతించే అవకాశం ఉండదం టున్నారు. మోడీ ఎటూ టైం ఇవ్వరు కాబట్టి.. ఆ ప్రయత్నం చేశామన్న మాట చెప్పుకోవటానికే తప్పించి మరింకేమీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అపాయింట్‌మెంట్ అంశంపై మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.











