ఒకరు గులాబీ దళపతి.. మరొకరు కాషాయ చీఫ్. వీరిద్దరు నువ్వా.. నేనా.. అన్నతంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. విమర్శలే కాదు ఏకంగా సవాళ్లు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఈ సవాళ్ల పర్వం మంత్రి హరీష్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య నడిచింది. తాజాగా అది కాస్త సీఎం కేసీఆర్, బండి సంజయ్ మధ్యకు చేరింది. శనివారం సీఎం కేసీఆర్ ఓ కార్యక్రమంలో పాల్గొంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. కేంద్రం పిఛన్లు మనిషికి రూ.200 చొప్పున మాత్రమే ఇస్తోందని, కానీ బీజేపీ నేతలు మాత్రం మనిషికి రూ.1600 చొప్పున ఇస్తున్నట్లు అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల విషయంలో తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్.. బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కేసీఆర్ సవాల్‌పై బండి సంజయ్ స్పందించారు.
మాటకు మాట..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పుబట్టారు. బీజేపీ ప్రభుత్వంపై మాయమాటలు చెప్పి ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాయచేస్తోందన్నారు. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో శనివారం బండి పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం నిధుల విడుదల విషయంపై చర్చకు రావాలని కేసీఆర్‌కు ఆయన ప్రతి సవాల్ విసిరారు. ఒకవేళ తెలంగాణకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని నిరూపిస్తే తాను దుబ్బాక ఛౌరస్తాలో ఉరివేసుకుంటానని ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ చెప్పే కల్లబొల్లి మాటలను దుబ్బాక ప్రజలు నమ్మొద్దని బండి సంజయ్ పేర్కొన్నారు.
మెప్పు కోసమే అంతా..
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే.. కేసీఆర్ చేప్పేదీ దాంట్లో నిజం లేదని చెప్పలేము . అలాగే బండి సంజయ్ విసిరిన సవాల్‌లో కూడా అబద్దం ఉందని అనలేము. ఏదోక రూపంలో రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తునే ఉంటుంది. అలాగే పెన్షన్ల విషయంలో ఒక్కొక్కరికి ఇచ్చే మొత్తంలో కేంద్రమే అంతా ఇస్తుందని కూడా చెప్పలేము. నేతలు విసురుకునే సవాళ్లు ఓట్ల కోసమో.. ప్రజల మెప్పు కోసమే అనే విషయం మనం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నేతలలాగే మనం కూడా వాటిని సీరియస్ గా తీసుకోకూడదు.











