నేచురల్ స్టార్ నానీ అభినయం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రనైనా తన దైన స్టైల్లోకి అడాప్ట్ చేసుకోగల టాలెంట్ అతడిది. ప్రయోగాలకు ఎప్పుడూ అతడు సిద్ధమే. కానీ ఇంతవరకూ నానీకి దాని అవసరం అంతగా రాలేదు. అయితే అతడి తాజా సినిమా కోసం నానీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిచడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. సినిమాపేరు ‘శ్యామ్ సింగరాయ్’. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దీనికి దర్శకుడు. ఈ సినిమా లో నానీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో నానీ 70 ఏళ్ళ వృద్ధుడిగా నటించబోతున్నాడట.
‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ఓ రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. అందులో ఒకటి యువకుడిదైతే.. మరొక పాత్ర వృద్ధుడిదట. ఇందులోని వృద్ధుడి పాత్ర రివెంజ్ తీర్చుకుంటుందని టాక్. అంతేకాదండోయ్ ఆ వృద్ధుడు ఒక దేశభక్తుడుట. గతంలో సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’ లోని కమల్ పోషించిన సేనాపతిని తలపిస్తోన్న ఆ పాత్రలో నానీ ఏ రేంజ్ లో నటించబోతున్నాడనే ఆసక్తి కలుగుతోంది.
ఇక శ్యామ్ సింగరాయ్ లోని వృద్ధుడి పాత్ర కోసం నానీకి.. కొన్ని గంటల సేపు ప్రోస్తటిక్ మేకప్ వేయబోతున్నారట. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపుతున్నారట. పీరియాడికల్ టచ్ ఉన్న ఈ మూవీలో.. నానీ ఓల్డ్ గెటప్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తుందట. కృతిశెట్టి కథానాయికగా నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ మూవీ నానీ కి ఏరేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.











