ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి నోళ్లల్లో నానుతున్న పేరు దుబ్బాక. మొన్న జరిగిన దుబ్బాక లడాయి పీక్ స్టేజీకి చేరడంతో ఆ నియోజకవర్గ ఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. ఆ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో.. అనే చర్చ ఇప్పుడు సర్వత్ర జరుగుతుంది. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉపఎన్నిక జరుగుతోంది. అయితే ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో సాధారణంగానే ప్రభుత్వానికి ఉన్న అడ్వాంటేజ్‌తో గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి ఉప ఎన్నికలు గతంలో జరిగినా దాదాపు ఆ స్థానాలను అధికార పార్టీలే కైవసం చేసుకున్న దాఖలాలున్నాయి. ఇది తెలిసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మరెందుకు దుబ్బాక ఉపఎన్నికలపై ఇంతలా ఫోకస్ పెట్టి టీఆర్ఎస్‌తో అమీతుమీ తేల్చుకుంటున్నాయి.
ఊహించని ఫలితాలు..
రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను ప్రజలు పట్టంకట్టారు. అలాగే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ టీఆర్ఎస్ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తరువాత 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్‌లో మార్పు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఏకంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండాను ఎగురవేసి తన సత్తాను చాటుకుంది.
బలమైన శక్తి దిశగా..
2018 ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు పోయిన టీఆర్ఎస్ పార్టీ 80కి పైగా సీట్లను కైవసం చేసుకుంది. తక్కువ సీట్లతో రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిస్తే.. బీజేపీ మాత్రం ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. కానీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బీజేపీ మట్టికరిపించి అనూహ్యంగా 4 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. అంటే దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల్లో బీజేపీ ప్రభావం కనిపించింది. ఈ ఫలితాలే బీజేపీ నాయకత్వానికి బూస్ట్‌గా మార్చాయి. ఇక తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న సంకేతాలను తమకు ఓటర్లు ఇచ్చారనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల నుంచి టీఆర్ఎస్‌కు ప్రత్యమ్నాయంగా బీజేపీ ఎదుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా ఊపందుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ వాతావరణం ఉండేది. కానీ లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా సీన్ అంతా మారిపోయింది. ఏ ఎన్నికల్లోనైనా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ మాత్రమే ఉండేలా చేయాలని బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.
గెలుపు లేదా సెకండ్ ప్లేస్..
ఈ నేపథ్యంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ పార్టీ పెద్దలు టార్గెట్ చేసుకుని గెలపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నడూ లేనంతగా ఈ సారి దుబ్బాక ఉప ఎన్నికల పోరు జరుగుతోందని, రాష్ట్ర ప్రజల దృష్టిని ఆ ఎన్నిక ఆకర్షిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మొన్న దుబ్బాకలో జరిగిన హైడ్రామానే దీనికి నిదర్శనం. అయితే గెలుపు.. లేకుంటే సెకెండ్ ప్లేస్ మాత్రమే ఉండాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ మాత్రం పుంజుకోవడానికి వీళ్లేదని లెక్కలు వేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
దాదాపు విజయం కోసమే తమ పోటీ.. ఒక వేళ ఓడినా కానీ సెకెండ్ ప్లేస్‌లో ఉండేలా చూసుకోవాలని బీజేపీ పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలను డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే అయితే గెలుపు లేదా సెకెండ్ ప్లేస్ అని టార్గెట్‌ను బీజేపీ పెట్టుకున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీకూడా ఇంచుమించు ఇలాంటి టార్గెట్‌నే పెట్టుకున్నట్లు తెలస్తోంది. బీజేపీకి వెనక్కి నెట్టేయాలనే వ్యూహంతో దుబ్బాక ఎన్నికల్లో ముందుకు పోతోంది. ఇలా రెండు జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలను దుబ్బాక ఉప ఎన్నికల్లో చేస్తున్నాయి.