నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్ రావణ్ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. కస్టడీ మూడో రోజైన ఆదివారం గన్నవరం పోలీసులు ఆయనను పలు కోణాల్లో ప్రశ్నించగా.. ‘సున్నితమైన చాలా అంశాలపై అనవసరంగా ఎక్కువ స్పందించా, కోరి వివాదాలు తెచ్చుకున్నా అంటూ రావణ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
హిందూ దేవతలను కించపరుస్తూ వీడియోలు చేయడం మతసామరస్యాన్ని దెబ్బతీయడం కాదా అని పోలీసులు ఛానల్లోని వివాదాస్పద క్లిపింగ్స్ చూపించి నిలదీశారు. దీనికి స్పందించిన రావణ్.. ఆ వీడియోల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది అంటూ బదులిచ్చారు. అలాగే స్క్రిప్ట్‌ల రూపకల్పనపై అడిగిన ప్రశ్నకు తానే స్వయంగా చేస్తానని, కొన్నిసార్లు ఇతరుల సలహాలు కూడా తీసుకుంటానని వివరించినట్లు తెలిసింది.
ఇక ఛానల్ నిర్వహణలో గమన, ఇంద్రసేనానాయుడి పాత్రల గురించి పోలీసులు ఆరా తీశారు. గమనే పరిపాలన వ్యవహారాలు చూసుకునే వారని, ఆఫీసును ఇంద్రసేన నుంచి తీసుకున్నామని తెలిపాడు. అయితే ఛానల్‌కు అందే ఆర్థిక వనరులు, ప్రకటనల ఆదాయం, వైసీపీ నేతలతో సంబంధాలపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానాలు దాటవేయడం గమనార్హం.
మొత్తంగా చూస్తే.. యూట్యూబర్ రావణ్ తన తప్పును అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. చిన్న విషయాలకు తాను అతిగా స్పందించానని, ఇలాంటి వివాదాలను కొనితెచ్చుకోకుండా ఉండాల్సిందంటూ ఆయన పశ్చాత్తాపపడినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలు, ఇతర సహచరుల ప్రమేయంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.











