అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్-13 కీలకమైన రెండో దశలోకి ప్రవేశించింది. ఈ రోజుతో ప్రతి జట్టూ మిగతా అన్ని టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడేసినట్టే. అంటే అన్ని టీమ్‌లూ ఏడేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. మంగళవారం నుంచి సెకెండ్ టర్మ్ ప్రారంభం కానుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్.
ఈ రెండు టీమ్‌ల మధ్య ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో గెలిచి హైదరాబాద్‌పై పగ తీర్చుకోవాలని ధోనీ సేన ఊవిళ్లూరుతోంది. అలాగే ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక, హైదరాబాద్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
చెన్నై టీమ్ బలాలు
ఇప్పటికైనా తమ కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావాలని చెన్నై టీమ్ కోరుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచిన ధోనీ సేన ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. వాట్సన్, డుప్లెసిస్, రాయుడు, ధోనీ, జడేజా వంటి ఆటగాళ్లు సమష్టిగా రాణిస్తే చెన్నై ఆశలు సజీవంగానే ఉంటాయి. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే చెన్నై బౌలింగ్ విభాగం బలంగా ఉంది. కర్రన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ బంతితో చక్కగా రాణిస్తున్నారు. వీరికి బ్యాటింగ్ విభాగం నుంచి కూడా సహకారం అందాల్సి ఉంది.
బలహీనతలు
ప్రస్తుతం చెన్నై జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో చెన్నై టీమ్ ఒక్క విజయం మాత్రమే సాధించింది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను క్లిష్టం చేసుకుంది. దీంతో జట్టులో తీవ్ర నిరాశ అలుముకుంది. ఐపీఎల్ చరిత్రంలో బెస్ట్ ఛేజింగ్ టీమ్ అనిపించుకున్న చెన్నై టీమ్ ఇప్పుడు స్వల్ప లక్ష్యాలను కూడా ఛేదించలేకపోతోంది. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 164 పరుగులను ఛేదించలేకపోయింది. జట్టులో ఉన్న స్టార్ ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్స్ కూడా ఆకట్టుకోలేకపోతున్నారు.
చెన్నై టీమ్ (అంచనా)
వాట్సన్, రాయుడు, డుప్లెసిస్, ధోనీ, కర్రన్, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, జడేజా, కర్ణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.
హైదరాబాద్ టీమ్ బలాలు
గత మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించడం హైదరాబాద్‌లో ఆత్మవిశ్వాసం నింపుతోంది. ఆ మ్యాచ్‌లో ఓ మోస్తరు లక్ష్యాన్ని హైదరాబాద్ బౌలర్లు కాపడుకోగలిగారు. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలుపొంది హైదరాబాద్ టీమ్ ఉత్సాహంగా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోష్ కొనసాగించాలని ఆరాటపడుతోంది. వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, విలియమ్సన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే రషీద్ ఖాన్, సందీప్ శర్మ, నటరాజన్ బంతితో ఆకట్టుకుంటున్నారు.
బలహీనతలు
వరుస పరాజయాలతో జోరుగా ఉన్న హైదరాబాద్‌కు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్రేకులేసింది. ప్రముఖ బౌలర్ భువనేశ్వర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం మ్యాచ్‌కు కూడా భువి అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. అలాగే టీమ్ నిలకడగా రాణించలేకపోతోంది. కెప్టెన్ వార్నర్‌పైనే టీమ్ ఎక్కువగా ఆధారపడుతోంది. లోయర్ మిడిలార్డర్‌లో నికార్సయిన ఆల్ రౌండర్ లేని లోటు కనిపిస్తోంది. అలాగే మిచెల్ మార్ష్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.
హైదరాబాద్ టీమ్ (అంచనా)
వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియం గార్గ్, అబ్దుల్, అభిషేక్, ఖలీల్ ఆహ్మద్, నటరాజన్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ.
మ్యాచ్ ఫేవరెట్
ఈ మ్యాచ్‌లో చెన్నై కంటే హైదరాబాద్ టీమ్‌కే గెలిచే ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని విభాగాల్లోనూ చెన్నై కంటే వార్నర్ సేన బలంగా కనబడుతోంది. మరోవైపు తప్పకుండా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఎలా పోరాడుతుందో చూడాలి. ఇప్పటికైనా బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి రాకుంటే చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైనట్టే.











