ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ పరిహార చట్టంలోని సెక్షన్7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు చెల్లించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ పరిహారంను తప్పనిసరిగా పరిహార నిధి నుండే చెల్లించాలని పేర్కొనడం విశేషం. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగింది. అయితే ఈ సమావేశంలో తెలంగాణ వాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం హరీష్ చేశారు.
ఆప్షన్ 1 లో చెల్లించాల్సిన పరిహారాన్ని లక్ష పది వేల కోట్ల కు, ఆప్షన్ 2 లో లక్ష 83 వేల కోట్లు కు రివైజ్డ్ చేయడం జరిగింది. వీటి మధ్య అంతరం 73 వేల కోట్లు మాత్రమే. ఇదేమి పెద్ద మొత్తం కాదు. ఆప్షన్ 1 లో పేర్కొన్న పరిహారంతో పాటు ఈ 73 వేల కోట్లు చెల్లించాలని కేంద్రానికి మంత్రి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చత్తీస్‌గఢ్ మంత్రి చెప్పినట్లు జీఎస్టీ పరిహారం చెల్లింపుల కోసం తీసుకునే రుణం ఆర్టికల్ 293 పరిధిలో ఉండదు. దీన్ని నేను కూడా సమర్థిస్తున్నానని మంత్రి హరీష్ తెలిపారు.
సెస్‌తో పాటు జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసే ఇతర మొత్తం నిధులను తప్పనిసరిగా జీఎస్టీ పరిహార నిధిలో జమచేయాలని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 కింద పెర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు పరిహార నిధి చట్టం సెక్షన్ 10(1) చెబుతోందని, దీనిపైన జీఎస్టీ కౌన్సిల్ చర్చించవచ్చని పేర్కొన్నారు.










