ఆయన్ని వెనక నుంచి చూస్తే అచ్చు ఎన్టీఆర్ లానే ఉంటారు.. దూరం నుంచి చూస్తే ఎన్టీఆర్ పోలికలు ఉంటాయి. ఎన్టీఆర్ ఎన్ని రకాల పౌరాణిక పాత్రలు వేశారో అన్ని ఆయన కూడా వేశారు.
నటన అనే నవరస కళాక్షేత్రంలో సార్వభౌముడిగా వెలిగిపోయారు. తెలుగు సినిమాకి ఈరోజు విలన్ పాత్రల కోసం ఇతర రాష్ట్రాలకు పరుగులు పెడుతున్నాము గానీ తెలుగు తెరకు దొరికిన నికార్సయిన విలన్ ఎవరంటే కైకాల సత్యనారాయణ అనే చెప్పాలి. ఒకటా రెండా దాదాపు 800 చిత్రాల్లో ఆయన నటించారు. అంటే అరవయ్యేళ్ల పాటు అవిశ్రాంతంగా నటించారాయన. ఎందరో హీరోలకు ఆయన ఒక్కడే విలన్.. ఆయన గురించి ఇలా చెబితేనే బాగుంటుందేమో. తెలుగు సినిమా ఐదు తరాల హీరోల చిత్రాల్లో ఆయన నటించారు.
సిపాయి కూతురితో హీరోగానే..
1959 లో ‘సిపాయి కూతురు’ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. హీరోగా ఎదగాలనుకుంటే విధి విలన్ ని చేసింది. నిర్మాత డి.ఎల్. నారాయణ పర్మినెంట్ ఆర్టిస్టుగా మూడేళ్లు అగ్రిమెంట్ చేసుకోవడంతో హీరో అవకాశాలు పోయాయంటారాయన. మొదటి సినిమాకి ఆయన అందుకున్న పారితోషికం రూ. 300. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా ఏ పాత్రలో నటించినా అందులో ఒదిగిపోతారు. ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయి పాత్రలు పోషించగల సత్తా ఉన్న ఒకే ఒక నటుడు సత్యనారాయణ. తన 60 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 800 చిత్రాల్లో నటించారు. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలను ఇంకెవరూ పోషించలేదు.
విలనిజానికి ఓ ప్రత్యేకత తెచ్చిన నటుడు అని కూడా చెప్పవచ్చు. మహిళలు కూడా తిట్టుకునేలా ఆయన పోషించిన పాత్రలు ఉండేవి. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపదం, కామెడీ విలన్, కరుడు కట్టిన విలన్, మంచి తాతయ్య.. ఇలా ఒక్కటేమిటి అనేక రకాల పాత్రలను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘రాముడు భీముడు’ చిత్రంలో ఎన్టీఆర్ కు డూప్ గానూ నటించారు. ఆయన శరీర నిర్మాణం ఎన్టీఆర్ లా ఉండటంతో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చినప్పుడు కైకాలనే సంప్రదించేవారు. పైగా ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉండేది.
ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాల్లో కైకాల కూడా తప్పనిసరిగా ఉండేవారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామం ఆయన సొంతూరు. 1935 జూలై 25న పుట్టారు. సినిమా రంగంలో వేషాల కోసం చెన్నైలో అనేక కష్టాలు పడి అంచెలంచెలుగా ఎదిగారు. 1960లో సత్యనారాయణ నాగేశ్వరమ్మని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. రమా ఫిలింస్ బ్యానర్ ను స్థాపించి అనేక చిత్రాలను కూడా నిర్మించారు. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగు దేశం పార్టీలో మొదట్లోనే చేరినా 1996లో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు.
ఎన్టీఆర్ రూపురేఖలే నిలబెట్టాయి
కైకాలలో ఎన్టీఆర్ పోలికలు ఎక్కువ ఉండటం వల్లే చిత్ర పరిశ్రమ ఆయనపై దృష్టి సారించింది. ఎన్టీఆర్ లా ఉన్నాననే మాటను మొదట కేవీ రెడ్డి అన్నారంటారు కైకాల. ఆ తర్వాత అది ఇండస్ట్రీ అంతా పాకిందట.
‘ఆర్టిస్ట్ అనే వాడు అన్ని పాత్రలు చెయ్యాలి. మొదట నేను హీరో గా ఫెయిల్యూర్స్ చూశా, విఠలాచార్య గారు కనకదుర్గ పూజా మహిమ చిత్రంలో విలన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అగ్గిపిడుగు లో విలన్ గా ఇచ్చారు. అది మంచి పేరు తీసుకొచ్చి.. నాది రామారావు గారిది మంచి కాంబినేషన్ గా సెట్ అయ్యింది. అలా తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ విలన్ గా పేరు తెచ్చుకున్నా’ అన్నారు ఓ ఇంటర్యూలో కైకాల.
డైలాగ్ పలకడంలోనూ ఆయనకు ఓ ప్రత్యేకత ఉండేది. అది ఆయన కంఠస్వరానికి ఉన్న గొప్పతనం. దాదాపు 28 పౌరాణిక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్ పోషించిన పాత్రలన్నీ ఆయన కూడా చేశారు. ఆఖరికి ఎన్టీఆర్ వేసిన రాముడు, కృష్ణుడు పాత్రలకు కూడా ఆయన డూప్ గా చేశారు. ఆయన ‘యముండ..’ అంటూ డైలాగ్ పలికితే చాలు జనం కేరింతలు కొట్టారు. యమలీల చిత్రంలో యముడి పాత్రలో ఐస్ క్రీమ్ ని హిమక్రీములు అంటూ సంబోధిస్తూ కామెడీ కూడా చేశారు. సూత్రధారులు చిత్రంలో నీలకంఠయ్య పాత్ర, నిప్పులాంటి మనిషి చిత్రంలో షేర్ ఖాన్ పాత్ర ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. పైగా అందులో ‘స్నేహమేరా జీవితం’ పాట పెద్ద హిట్. హిందీలో ప్రాణ్ పోషించిన పాత్ర ఇది. అలాగే నా పేరే భగవాన్ అనే ఓ సినిమాలోనూ టైటిల్ రోల్ పోషించారు.
తాయారమ్మ బంగారయ్య, ఘటోత్కచుడు, యమలీల చిత్రాల్లో టైటిల్ పాత్రధారి ఆయనే. దేవుడు చేసిన మనుషులు చిత్రంలో మందుబాబుగా ఆయన చేసిన పాత్రకు జనం జేజేలు పలికారు. తమ్ముడిని నిర్మాతగా చేసి రమా ఫిలింస్ బ్యానర్ మీద 8 సినిమాలు నిర్మించారు. ఇప్పుడు కూడా కైకాల కుమారులు చిత్ర నిర్మాణంలో ఉన్నారు. కేజీఎప్ 2 చిత్రానికి తెలుగు నిర్మాత కైకాల కుమారుడే. ఆయనకు కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్, ఎయన్నార్, శోభన్ బాబు, ఎస్వీ రంగారావుల మాదిరిగా తనకంటూ ఓ ప్రత్యేక పేజీని సాధించుకున్న ఘనత కైకాల సత్యనారాయణదేననడంలో అతిశయోక్తి లేదు.











