సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు వింటే ప్రతి భారతీయుడి గుండె ఉద్వేగంతో ఉప్పొంగుతుంది. భారత స్వాతంత్ర్య పోరాటంపై తనదైన ముద్ర వేసిన ఈ యోధుడి గాథ వింటే.. ఉడుకునెత్తురు ఉప్పెనై ఉరుకుతుంది. రెండు దశాబ్దాలకు పైగా.. నాటి బ్రిటిష్ పాలకులకు చుక్కలు చూపించారు. తన మార్కు పోరాటంతో.. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. యువతలో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించి.. పోరుబాట పట్టించారు. పోరాటం దిశగా కార్యోన్ముఖులను చేశారు. వారికి దిశా నిర్దేశం చేస్తూ.. ముందుండి నడిపించారు. ఈ క్రమంలో.. మహాత్ముడి తర్వాత దేశంపై తీవ్రమైన ప్రభావం చూపించారు. భారతదేశపు మొదటి సైన్యం.. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను స్థాపించి.. ‘నేతాజీ’ బిరుదాంకితుడయ్యారు. తన పేరుకన్నా ఎక్కువగా బిరుదుతోనే ఆయన ప్రాచుర్యం పొందారు. ఎంతలా అంటే.. నేతాజీ ఎవరు అని పసి పిల్లవాడిని అడిగినా.. ఠక్కున సమాధానం చెప్పేస్తాడు.. సుభాష్ చంద్రబోస్ అని.
ఒడిశాలో పుట్టి.. బెంగాల్‌లో స్థిరపడి..
1897లో ఒడిశాలోని కటక్‌లో జన్మించిన బోస్.. పశ్చిమబెంగాల్ లో స్థిరపడ్డారు. అక్కడ సివిస్ సర్వీస్ స్థాయి పరీక్షలో ఉన్నత ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యారు. అంతటి హోదాను త్యజించి.. పాతికేళ్ల నవ యవ్వనంలో.. 1923లో స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. అప్పటికే గాంధీజీ.. తన అహింసా సిద్ధాంతంతో స్వాతంత్ర్యపోరాటాన్ని ఉధృతంగా నడిపిస్తున్నారు. ఓ పోరాట యోధుడిగా గాంధీజీపై అపారమైన గౌరవాభిమానాలున్న మన నేతాజీ.. ఆయన సిద్ధాంతంతో మాత్రం పూర్తిగా విభేదించేవారు. ముల్లును ముల్లుతోనే తీయాలని, బ్రిటిష్ మద గజాన్ని తరిమికొట్టాలంటే.. సాయుధ పోరాటమే మార్గమని నేతాజీ.. బలంగా నమ్మేవారు. అలాగే, మహాత్ముడికి కూడా నేతాజీపై అపారమైన ప్రేమాభిమానాలు ఉండేవి. కానీ, ఆయన కూడా నేతాజీ లక్ష్యాన్ని గౌరవిస్తూనే.. దాని సాధనకు ఆయన ఎంచుకున్న మార్గాన్ని వ్యతిరేకించేవారు. నేతాజీ కూడా కొంత కాలం పాటు అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఇక్కడ ఆయన అతివాద భావజాలం.. గాంధీజీకి నచ్చేది కాదు. ఆవేశం తగ్గించుకుని.. శాంతిబాటలో తనతో కలిసి ప్రయాణించాల్సిందిగా ఆయనకు అనేక సార్లు సూచించారు. అందుకు నేతాజీ ససేమిరా అనేవారు.
ఒకానొక సందర్భంలో గాంధీని మించిన క్రేజ్
1938లో నేతాజీ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అదే సమయంలో.. పట్టాభి సీతారామయ్యను గాంధీజీ తన తరఫున అభ్యర్థిగా నిలబెట్టారు. నాడు జరిగిన ఆ ఎన్నికల్లో.. నేతాజీ ఘనవిజయం సాధించారు. దీనిపై తీవ్రంగా మనస్తాపం చెందిన గాంధీ.. ఒక అతివాదిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను గుర్తించబోనని ప్రకటించడంతో.. ప్రమాణస్వీకారం చేయకుండానే తన పదవిని త్యజించిన త్యాగశీలి మన నేతాజీ. అనంతర కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1937లో బోస్.. తనకు సెక్రటరీగా ఉన్న ఎమినీ పింకెల్ అనే ఓ ఆస్ట్రియా యువతిని వివాహం చేసుకున్నారు.
వ్యూహ రచనలో దిట్ట
వ్యూహ రచనా సామర్థ్యంలో నేతాజీ.. తనకు తానే సాటి. ఆయన వ్యూహాలు.. బ్రిటిషు వారికి ఓ పట్టానా అంతు చిక్కేవికావు. ఓ సారి నేతాజీ ఓ ఇంట్లో ఉన్నారిని తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు.. ఆ ఇంటిని చుట్టుముట్టారు. లొంగిపోవాల్సిందిగా మైకులో నేతాజీని హెచ్చరిస్తున్నారు. ఇంతలో.. ఇంటి వెనుక తలుపు తీసుకుని ఓ అందమై యువతి హడావుడిగా వెళ్లిపోతోంది. ఇది గమనించిన పోలీసులు.. ఆ యువతిని ప్రశ్నించగా.. నేతాజీ లోపలే ఉన్నాడని, వెంటనే వెళితే దొరుకుతాడని వారికి చెప్పింది. దీంతో.. పోలీసులు అన్ని వైపుల నుంచీ ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. కానీ, వారికి అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పటికిగానీ వారి మట్టి బుర్రలకు తట్టలేదు.. ఆ అందమైన యువతిలో నేతాజీ పోలికలు ఉన్నాయని, అది ఆయనేనని. ఆయన స్త్రీ వేషం వేస్తే.. అచ్చు మహిళ లానే ఉంటారని, మంచి అందగాడని ఆయనతో పనిచేసిన నాటి నాయకులు చెప్పేవారు.
ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి.. నేతాజీ..
బ్రిటిష్ వారిచే తీవ్రవాదిగా ముద్ర వేయించుకున్న నేతాజీ.. అనేక సార్లు జైలుపాలయ్యారు. బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేసేందుకు దేశానికి ఓ సైన్యం కావాలని భావించారు. ఈ క్రమంలో.. ఆయన దేశ విదేశాల్లో పర్యటించారు. స్వాతంత్ర్య పోరాటానికి వివిధ దేశాల మద్దతు కోరారు. జర్మనీ, జపాన్, రష్యాలో పర్యటించారు. వీటిలో జర్మనీ, జపాన్ లు ఆయనకు పూర్తిగా సహకరించాయి. వాటి సహకారంతో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను నిర్మించారు. ‘మీ రక్తం ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తా’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపునందుకొని.. నాటి యువత ఉప్పెనలా తరలివచ్చి.. ఆయన సైన్యంలో చేరారు. దీన్నే భారతదేశ తొలి సైన్యంగా భావించవచ్చు. స్వాతంత్ర్య సాధనే దీని ఏకైక లక్ష్యం. ఆయన ప్రసంగాలు ఉద్వేగభరితంగా.. ఉత్తేజపూరితంగా ఉంటూ.. యువతను విశేషంగా ఆకట్టుకునేవి.
హిట్లర్‌తో స్నేహం
నాటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో నేతాజీ స్నేహం ప్రత్యేకమైంది. ఓ సారి నేతాజీ.. హిట్లర్‌ను కలిసేందుకు జర్మనీలోని ఆయన భవంతికి వెళ్లారు. ‘ఎలా ఉన్నారు బోస్’ అంటూ హిట్లర్.. ఆయన్ను పలకరించారు. దీనికి నేతాజీ స్పందిస్తూ.. ‘వెళ్లి మీ బాస్ ను పిలువు.. ఆయనకు చెప్తా’ అన్నారు. దీంతో.. నిజమైన హిట్లర్.. వెనక నుంచి వచ్చి బోస్ భుజం చరిచారు. ‘ఎలా కనిపెట్టారు బోస్.. ముందుగా వచ్చింది నేను కానని’ అని అడిగారు. దీనికి బోస్.. ‘నా భుజాన్ని చరిచే ధైర్యం హిట్లర్ కు మాత్రమే ఉంది’ అని సమాధానం చెప్పారు. హిట్లర్ ను పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం మన బోస్ కు మాత్రమే ఉండేదని అప్పటి నాయకులు చెప్పేవారు.
స్వాతంత్య్రం ఒకరి దయతో వచ్చేది కాదు
నేతాజీ.. ముక్కుసూటి మనిషి. ఇదే ఆయన బలం. ఎవరేమనుకున్నా.. ఆయన లెక్క చేసేవారు కారు. ‘స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఒకరి దయతో వచ్చేవి కావు.. వాటిని పోరాడి సాధించుకోవాల్సిందే’ అని బలంగా నమ్మేవారు బోస్. ఆయన నాయకత్వ పటిమ, పోరాటతత్వం, పట్టుదల, కార్యదక్షత నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అని చెప్పే బోస్.. తన ‘జైహింద్’ నినాదంతో దేశమంతా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించారు. ఈ నినాదం వింటే.. ఇప్పటికీ రక్తం ఉప్పొంగుతుంది. ‘ఉప్పొంగే రక్తమున్న ప్రతి వాడూ సైనికుడే’ అనే నేతాజీ.. ‘రక్తమివ్వండి.. స్వేచ్ఛనిస్తా’ అనే నినాదంతో యువతను ఆకర్షించారు.
మరణం లేని జననం..
బోస్ జీవితంలాగే.. ఆయన మరణం కూడా వివాదాస్పదమే. తైవాన్ నుంచి టోక్యో వెళుతుండగా జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారు. కానీ, అక్కడ ఆయన మృతదేహం దొరకకపోవడంతో.. ఆయన మరణించలేదని అభిమానులు నమ్మేవారు. 80వ దశకంలో యూపీలో ఉండే భగవాన్‌జీ అనే ఓ సన్యాసిలో బోస్ పోలికలు ఎక్కువగా కనిపించేవని బాగా ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఆయన కూడా ఒకటి రెండు సందర్భాల్లో తాను బోస్ నని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో.. అప్పటి జనం ఆయన్ను బోస్‌లా భావిస్తూ పూజలు చేసేవారు. కొంత కాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత అధికారులు ఆక్కడ పరిశీలించి.. ఆయన బోస్ కాదని తేల్చారు. అయినా అనుమానాలు వీడలేదు. ఆ తర్వాత 2006లో ఓ స్వతంత్ర కమిటీ.. దీనిపై విచారించి.. భగవాన్ జీనే సుభాష్ చంద్రబోస్ అని తేల్చింది. తన నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించింది. కానీ, ప్రభుత్వం.. ఈ నివేదికను తిరస్కరించింది.
దేశం కోసమే పుట్టి.. దేశం కోసమే జీవించి.. దేశం కోసమే మరణించిన ఈ మహా యోధుఢికి ‘భారతరత్న’ ఇచ్చే స్థాయి ఈ ప్రభుత్వాలకి లేకపోయినా.. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ‘భారతరత్నమే’. ‘నేత’ అనే మాటకే పర్యాయపదంలా నిలిచిన మన నేతాజీ 125వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడం ప్రతి భారతీయుడి కనీస ధర్మం. దాన్ని నిర్వర్తిద్దాం.
‘జై హింద్’