తిరుపతిలో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టెంపుల్ టౌన్‌ని స్పిరిట్యువల్ సెంటర్‌లా అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా.. ఇక్కడ కొత్త టౌన్‌షిప్‌ను డెవలప్ చేయబోతున్నారు. డెల్లా టౌన్‌షిప్స్ సంస్థ 1400 ఎకరాల విస్తీర్ణంలో.. 35 వేల కోట్ల వ్యయంతో.. ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మిస్తుంది. ఇందులో 5 వేల సంవత్సరాల హిందూ మతం, ఆచారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన లైవ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. తిరుపతి స్పిరిట్యువల్ టౌన్‌షిప్ ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వీటిలో 80 శాతం జాబ్స్ స్థానికులకు కేటాయిస్తారు.
విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో.. డెల్లా టౌన్‌షిప్స్ సంస్థ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొంది. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా.. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. హిందూమతానికి చెందిన విభిన్న జ్ఞాన పరంపరలు, సంప్రదాయాలు, ఆచారాలను.. ఒక్క చోటకు చేర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 300 ఎకరాల్లో ఏర్పాటు చేసే లివింగ్ ఎగ్జిబిషన్‌లో.. సింధులోయ నాగరికత నుంచి ఆధునిక ఆధ్యాత్మిక చింతన వరకు భారత నాగరికతను ప్రతిబింబించేలా.. ఇక్కడ పెవిలియన్లు ఏర్పాటు చేస్తారు.
వేద విజ్ఞాన వ్యవస్థలు, శాస్త్రీయ కళలు, శిల్ప శాస్త్రం, ఆలయ నిర్మాణం, ప్రాంతీయ సంప్రదాయాలు.. ఇక్కడ ఎగ్జిబిషన్‌లో ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 600ల గదులతో ఫైవ్ స్టార్ రిసార్ట్ నిర్మిస్తారు. వీటికి తోడు విలాసవంతమైన నివాసాలు, ప్రైవేటు విల్లాలను అభివృద్ధి చేస్తారు. ఇలాంటి ప్రాక్టుల ద్వారా తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది.











