అవినీతికి పాల్పడి అక్రమంగా వేలకోట్లు దోచుకొన్న వారిని జైలుకు పంపాలి. మెడికల్ కాలేజీలు నిర్మించి.. డాక్టర్లను తయారు చేసిన వారికి సన్మానం చేయాలి. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగంలో.. అన్నీ రివర్స్‌లోనే ఉంటాయి. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో.. కేసుల వరకు రాని వ్యవహారాలు ఇంకెన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. అయినా దర్జాగా తిరుగుతూ.. అందరినీ బెదిరించడం ఆయనకే చెల్లుతుంది. తాజాగా కూటమి ప్రభుత్వంతో కలిసి ఎవరైనా మెడికల్ కాలేజీలు నిర్మిస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాళ్లను రెండు నెలల్లోనే జైలుకు పంపుతామని హెచ్చరించారు జగన్‌రెడ్డి.
వైసీపీ హయాంలో ప్రారంభించి.. మొండి గోడల స్థితిలో ఆగిపోయిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. జగన్ హయాంలో 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేయడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉంది. స్టేట్ ఫైనాన్స్ సహకరించకపోయినా.. పబ్లిక్ – ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌లో మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పీపీపీ విధానంతో మొత్తం ప్రైవేటుపరం చేస్తున్నారని వైసీపీ విష ప్రచారం చేస్తోంది.
ప్రైవేటు సంస్థలు మెడికల్ కాలేజీలు నిర్మించినా.. గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే పని చేస్తాయి. వైద్య విద్యార్ధులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే అమలవుతాయి. ఈ కాలేజీలకు అనుబంధంగా పనిచేసే ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. అయినా కూడా వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని.. వైసీపీ నేతలు, ఆ పార్టీ భజన చేసే మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి. జగన్ హయాంలో స్వయంగా ప్రభుత్వమే నడిపిన వైన్స్ షాపుల్లో.. ఎంత నాసిరకమైన మద్యం అమ్మారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక్కడ సమస్య ప్రభుత్వమా.. ప్రైవేటా.. పీపీపీనా అని కాదు. వాటిని నడిపే వాళ్ల చిత్తశుద్ది.. ప్రజల పట్ల సేవానిరతి అనేవి ముఖ్యం. ప్రజల బాగోగులపై జగన్‌రెడ్డి ఆలోచనలు ఎలా ఉంటాయో… వైసీపీ పాలనలో మద్యం, ఇసుక విధానాలు గమనిస్తే ఇట్టే అర్ధమైపోతుంది. మెడికల్ కాలేజీల వ్యవహారంలోనూ రాజకీయమే తప్ప వైసీపీకి మరో ఆలోచన లేదని చెప్పొచ్చు.











