అనుకోని అతిథిగా విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ కు చెందిన ‘ఎంవి మా’ నౌక విశాఖ వాసులకు పర్యాటక కేంద్రంగా మారింది. ఈ నెల 13వ తేదీన వాయుగుండం కారణంగా ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ నౌక ను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. సెల్ఫీ లతో వెర్రెక్కి పోతున్నారు.
పరిసరాల్లోకి రావద్దని భద్రతా సిబ్బంది ఎంత వారిస్తున్నప్పటికీ, ఏదో ఒక రూపంలో నౌక సమీపంలోకి వెళ్లేందుకు సందర్శకులు ఆరాటం కనబరుస్తున్నారు. ఈ నౌక ఇక్కడ నుంచి కదిలేందుకు మరికొంత సమయం పట్టనుంది.
తొలి రెండు రోజులు నౌకను అతి సమీపం నుంచి చూసేందుకు అవకాశం చిక్కడంతో వందల సంఖ్యలో సందర్శకులు ఈ తీరానికి చేరుకునే వారు. గత మంగళవారం నుంచి నిత్యం వందల సంఖ్యలో నౌకను వీక్షించేందుకు తరలివస్తూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేశారు. రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతుండటంతో అధికారులు నౌక సమీపంలోకి సందర్శకులను రానివ్వడం లేదు.

నౌకను మళ్లీ సముద్రంలోకి పంపేందుకు తీసుకోవాల్సిన చర్యలు ప్రారంభమయ్యాయి. దాన్ని సురక్షితంగా సముద్రంలోకి పంపే ప్రక్రియలో భాగంగా నౌకలోని ఇంధనం మొత్తం వెలికితీసి, సులభంగా ఎటువంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నౌక కొట్టుకు వచ్చి, రాళ్ల మధ్య ఇరుక్కున్నప్పటికీ అడుగుభాగం పెద్దగా డ్యామేజ్ కాలేదని, అది మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అనువుగానే ఉందని తెలుస్తోంది. కొద్ది అవసరమైన చర్యలు తీసుకుంటే ‘ఎంవి మా’ తిరిగి స్వదేశానికి వెళుతుంది.











