బీహార్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార జేడీయూ నుంచి 17మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని ఆర్జేడీ నేత చేసిన ప్రకటనే ఇందుకు కారణం. ఈ ప్రకటన కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే అనుకోవడానికి లేదు. ఇప్పటికే బీహార్ లో జేడీయూతో పరిస్థితులు మారాయి. పార్టీ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ తప్పుకోవడం, బీహార్ లో మిత్ర పక్షంగా ఉంటూనే.. అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకోవడం, తనకు సీఎం పదవిపై పెద్దగా ఆసక్తి లేదని నితీష్ కుమార్ ప్రకటించడం.. ఇలా వారం రోజుల వ్యవధిలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఆర్జేడీ ఇప్పటికే ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 17మంది అధికార జేడీయూ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు రేపింది.
గత నవంబరులో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆర్జేడీ, బీజేపీ, జేడీయూ లకు ఎక్కువ సీట్లు వచ్చాయి. మహాఘట్ బంధన్ (మహా కూటమి)లో ఆర్జేడీ, కాంగ్రెస్ పక్షాలున్నాయి. 243 స్థానాల్లో 122 మేజిక్ ఫిగర్. కాగా ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఆర్జేడీ 76 సీట్లతో అత్యధిక స్థానాలు పొందింది. తర్వాత బీజేపీ 73 సీట్లు సాధించింది. జేడీయూ తక్కువగా 43 సీట్లు పొందింది. జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినా బీజేపీ మద్దతు ఇచ్చి నితీష్ ను ముఖ్యమంత్రిని చేసింది. ప్రస్తుతం జేడీయూ, నితీష్ కూటమికి 125 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ లకు 110 సీట్లు ఉన్నాయి. అప్పటివరకు బాగానే ఉన్నా.. తరువాతే అసలు చిరాకు మొదలైంది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక నెలరోజుల సమయంలో బీహార్ లో తీసుకుంటున్న నిర్ణయాల్లో బీజేపీ పూర్తిగా జోక్యం చేసుకోవడంతో నితీష్ ఇప్పటికే అసహనంగా ఉన్నారు. అది చాలదన్నట్లు.. రెండురోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లో అవసరం లేకపోయినా ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసుకోవడంపై నితీష్ ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జేడీయూ అధ్యక్ష బాధ్యతలనుంచి నితీష్ తప్పుకున్నారు. తన సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ ఆర్‌సీపీ సింగ్‌కు జేడీయూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు నితీష్. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి అవసరం లేదని, బీజేపీ ఒత్తిడితోనే తాను బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోనూ, బీజేపీలోనూ కలకలం రేపాయి. ఇక బీజేపీ తన పార్టీని చిన్నచూపు చూస్తోందని ఇప్పటికే జేడీయూ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి.
ఫిరాయింపులు కాదు.. విలీనాలేనా..
జేడీయూకి చెందిన 17 ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలో చేరనున్నట్లు ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ అన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్యామ్ రజాక్ ఇటీవలే రాజీనామా చేశారు. ఆ సమయంలోనూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ పై చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగానే ఉన్నారని అప్పట్లోనే వ్యాఖ్యానించారు. తాజాగా జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా ఆర్జేడీ తీర్థం పుచ్చుకోనున్నారని, తాము ఫిరాయింపుల చట్టం నిబంధనలను అతిక్రమించబోరని, అందుకోసం 28 మంది ఎమ్మెల్యేలు కలసి ఆర్జేడీలో చేరుతారని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఆర్జేడీ తాజాగా మరో ప్రతిపాదనను నితీష్ ముందు ఉంచింది. బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, క్రమేణా జేడీయూని నిర్వీర్యం చేస్తుందని ఆ పార్టీ కీలక నేత ఉదయ్ నారాయణ చౌదరి వ్యాఖ్యానించారు. నితీష్ ను గతంలో ఆర్జేడీ పార్టీ సీఎంని చేసిందని, నితీష్ ఇప్పుడు అది గుర్తుచేసుకోవాలని వ్యాఖ్యానించారు. నితీష్ మహాఘట్ బంధన్ లో చేరాలని, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ కు సీఎం బాధ్యతలు అప్పగించాలని, అందుకుగాను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నితీష్ కుమార్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి, ఆయనను పీఎం చేయడానికి ఆర్జేడీ పోరాడుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను సీఎం నితీష్ కుమార్ కొట్టి పారేశారు. ఆర్జేడీ చేస్తున్న వాదనలు నిరాధారమని, తమ పార్టీని ఎవరూ వీడడం లేదని వ్యాఖ్యానించారు.
ఇక్కడే మరో విషయం కూడా ఉంది. రాజకీయంగా నితీష్ కుమార్ చాణక్యుడిగా పేరున్నా.. భాగస్వామ్య పార్టీల బెదిరింపులకు లొంగరనే విషయం 2017లోనే బీజేపీకి అర్థమైంది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ పార్టీలు వేర్వేరుగా పోటీచేసినా.. ఫలితాల తరువాత ఆ రెండుపార్టీలు కలిశాయి. ఆర్జేడీ మద్దతుతో నితీష్ సీఎం అయ్యారు. అయితే తరువాత రెండేళ్లకు 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆర్జేడీతో భేదాభిప్రాయాలు రావడంతో రాజీనామా చేసిన నితీష్ కు వెంటనే 53 సీట్లు ఉన్న బీజేపీ మద్దతు లభించింది. దీంతో మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు నితీష్ కుమార్. అప్పటినుంచి బీజేపీతో కొనసాగుతున్నారు. 2020 ఎన్నికల్లో ఎన్డీయే లో భాగస్వాములుగా ఉన్న బీజేపీ 110చోట్ల పోటీ చేయగా, జేడీయూ 115 చోట్ల పోటీ చేసింది.