కొంగర జగ్గయ్య.. నవరసాలను ఆయన తన స్వరంతో శాసించారు .. తన కళ్లతో ఆదేశించారు. అప్పట్లో ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ ఇద్దరికీ కూడా వాళ్ల స్వరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తమ రూపానికి తగిన స్వరంతో వాళ్లు తమకి లభించిన పాత్రలను అద్భుతంగా పండించారు .. అశేష ప్రేక్షకులను మెప్పించారు. అలా ఖంగుమంటూ మ్రోగే తన కంచుకంఠాన్ని ఒక వజ్రాయుధంగా ఉపయోగిస్తూ, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో జగ్గయ్య తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. జగ్గయ్య .. తెనాలి సమీపంలోని ‘మోరంపూడి’ గ్రామంలో జన్మించారు. అప్పట్లోనే ఆయన తండ్రి నాటకాలు వేస్తూ ఉండేవారు. అదే బాటలో జగ్గయ్య నడిచారనే అనుకోవాలి. స్కూల్ డేస్ లోనే జగ్గయ్య చాలా తెలివైన విద్యార్థిగా ఉండేవారు.
ఒక వైపున మంచి మార్కులు తెచ్చుకుంటూ .. మరో వైపున నాటకాలపై ఆసక్తిని కనబరిచేవారు. కాలేజ్ ఏజ్ వచ్చేసరికి నాటకాల పట్ల ఆయన ఆసక్తి మరింత పెరిగింది. అప్పట్లో ‘సావిత్రి’ని .. ‘జమున’ను నాటకాలకు పరిచయం చేసింది ఆయనే. కాలేజ్ రోజుల్లోనే ఆయనకి సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది. ఎక్కువగా పుస్తకాలు చదవడం .. కవితలు రాయడం చేసేవారు. చిత్రలేఖనంలోను ఆయనకి మంచి ప్రవేశం ఉంది.
ఆ కాలంలో నాటకానుభవం ఉన్నవారంతా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు. అదే బాటలో జగ్గయ్య కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించి .. ‘ప్రియురాలు’ .. ‘ఆదర్శం’ అనే చిత్రాల్లో ఆయనకి హీరోగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆయన నిరాశ చెందారు. ‘బంగారుపాప’ సినిమా తరువాత నుంచి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అద్భుతమైన వాయిస్ ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది .. తెలుగు తెరపై ఆయన మాట మంత్రమై మోగేలా చేసింది.
ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్ వంటి అగ్రకథానాయకుల సినిమాలలో కీలకమైన పాత్రలను పోషిస్తూనే, కథానాయకుడిగా తనకి వచ్చిన అవకాశాలను కూడా ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అలా ఆయన ‘అన్నపూర్ణ’ .. ‘ఈడూ జోడూ’ .. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలలో హీరోగా విజయాలను అందుకున్నారు. పౌరాణికాలకు .. జానపదాలకు తన బాడీ లాంగ్వేజ్ సెట్ కాదని గ్రహించిన ఆయన, ఆ వైపు ఎక్కువగా వెళ్లలేదు. సాంఘిక చిత్రాలలోనే తన సత్తాను చాటుతూ వెళ్లారు. ఫలానా పాత్ర జగ్గయ్య చేస్తేనే బాగుంటుందని భావించి, దర్శక నిర్మాతలు తన కోసం వెయిట్ చేసేలా చేశారు.
‘డాక్టర్ చక్రవర్తి’లో భార్యను అనుమానించే భర్తగా .. ‘గుడిగంటలు’లో స్నేహితుడి కోసం ప్రియురాలికి దూరమైయ్యే మిత్రుడిగా .. ‘ఆత్మబలం’ సినిమాలో అహంభావం కలిగిన కుమార్ గా ఆయన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా ఆయన గొప్పగా పండించారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో రూథర్ ఫార్డ్ గా ఆయన ప్రదర్శించిన నటన అసమానం .. అద్భుతం అనిపించుకుంది. ఆ పాత్రకి కూడా ఆయన వాయిస్ ప్రధానమైన బలంగా నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే జగ్గయ్య తప్ప వేరెవరూ ఆ పాత్రను ఆ స్థాయిలో పండించలేరనే విషయం స్పష్టమవుతుంది.
ఒక వైపున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున సాహిత్య సేవ చేసేవారు. ప్రజలను చైతన్యవంతులను చేసే కవితలు రాస్తుండేవారు. అంతేకాదు ఇతరభాషా చిత్రాలు తెలుగులోకి అనువాదాలుగా అడుగుపెడుతున్నప్పుడు ప్రధానమైన పాత్రలకు డబ్బింగ్ చెప్పేవారు. ముఖ్యంగా ‘శివాజీ గణేశన్’కి ఆయన వాయిస్ అచ్చుగుద్దినట్టుగా సరిపోయేది. ‘భక్తతుకారం’ సినిమాలో ‘శివాజీ’ పాత్ర హైలైట్ గా నిలవడం వెనుక ప్రధానమైన పాత్ర వహించింది జగ్గయ్య వాయిస్సేనని చెప్పుకోవాలి.
ఇలా తన హుందాతనానికి తగిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నాలుగు దశాబ్దాలకి పైగా ఆయన తెలుగు తెరపై రాజ్యం చేశారు. మహామహులైన నటులతో కలిసి స్వర్ణయుగం చూశారు. వందలాది పాత్రలతో లక్షలాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. మొదటి నుంచి దేశాభిమాని అయిన ఆయన, రాజకీయాల్లోను ప్రవేశించి తనవంతు సేవలను అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ని తెలుగులో ‘రవీంద్ర గీత’ పేరుతో జగ్గయ్య అందించారు.
ఇలా వివిధ రంగాలలో తను చేసిన కృషికిగాను ఆయన ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు.జగ్గయ్య స్వరంలో రాజసం .. ఠీవీ .. దర్పం .. హుందాతనం వినిపిస్తాయి. అక్షరాలా ఆయన రూపంలోను అవే కనిపిస్తాయి. నవరసాలను శాసించిన .. శ్వాసించిన ఆ ‘కళావాచస్పతి’ జయంతి నేడు. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ ఆయనను స్మరించుకుంటోంది.
– పెద్దింటి గోపీకృష్ణ