సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే అనేలా ఆయన సినిమాలు ఉంటున్నాయి. రోబో తర్వాత సరైన హిట్ రజనీకి దక్కలేదంటే అతిశయోక్తి కాదు. కబాలి, కాలా, లింగ, పేట, దర్భార్, పెద్దన్న.. ఇలా వరుసగా రజనీ సినిమాలు వచ్చినా ఒక్కటీ అనుకున్న రేంజ్ కి రాలేదు. దాంతో జైలర్ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రజనీతో పాటు రమ్యకృష్ణ, తమన్నా, ప్రత్యేక పాత్రల్లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ లాంటి అతిరథ మహారథులంతా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళితే..
టైగర్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్ ) రిటైర్డ్ జైలర్. అతని కొడుకు అర్జున్ (వసంత్ రవి) పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఏసీపీ. తన కొడుకు, కోడలు, మనవడు, భార్యతో సాదాసీదా జీవితం గడుపుతుంటాడు ముత్తు. ఓ విగ్రహాల దోపిడీ ముఠా ఆటకట్టించే పనిలో ఏసీపీ అర్జున్ కనిపించకుండా పోతాడు. అతను మరణించాడని అందరూ అనుకుంటారు. విగ్రహాల దోపిడీ ముఠా నాయకుడు వర్మ (వినాయకన్) అతన్ని అంతమొందించాడని రజనీకి తెలుస్తుంది. రజనీ కుటుంబ సభ్యులందరినీ చంపాలని వర్మ ప్రయత్నిస్తుంటాడు.
అతడి చర్యలను రజనీ అడ్డుకుంటాడు. తన కొడుకు మరణానికి కారణమైన వారందరినీ చంపేస్తాడు ముత్తు. వర్మని చంపేద్దామనుకున్న ముత్తుకు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అతని కుమారుడు బతికే ఉన్నాడని, తనకు ఓ పని చేసి పెడితే కొడుకును అప్పగిస్తానని మాటిస్తాడు వర్మ. కొడుకు బతికే ఉన్నాడని తెలిసిన ముత్తు చివరికి వర్మ చెప్పిన పని చేయడానికి సిద్ధపడతాడు. వర్మ అతనికి అప్పగించిన పని ఏమిటి? ఆ పనిని చేయడానికి అతను ఎవరెవరి సాయం తీసుకున్నాడు? తన కొడుకు దొరికాడా లేదా? చివరికి ఈ కథ ఎలా ముగిసింది అన్న అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ముత్తు పాత్రలో రజనీ ఒదిగిపోయారు. నిజానికి ఆయన వయసుకు తగ్గ పాత్ర ఇది. కథనం స్లోగా సాగడం వల్ల ఆయన నుంచి ఎక్కువ మెరుపుల్ని ఆశించలేం. ప్రథమార్థం ఆసక్తికరంగా ఉన్నా స్లో నెరేషన్ కొంత ఇబ్బంది పెట్టింది. తను చేసేది రజనీతో సినిమా అనే విషయాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ మరచిపోయినట్టున్నారు. ద్వితీయార్థంలో కథ ట్రాక్ తప్పుతోందని ఎందుకు గమనించలేదో అర్థం కాదు. ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. ఫాస్ట్ కట్ చేసి ఉంటే సినిమా ఓ రేంజ్ లోకి వెళ్లిపోయి ఉండేది.
రజనీ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లోనూ పసలేకుండా పోయింది. ప్రథమార్థంలో యోగిబాబుతో కొన్ని సన్నివేశాల్లో డార్క్ కామెడీ బాగానే పండింది. ద్వితీయార్థంలో సునీల్, తమన్నాల సన్నివేశాలు కథను పక్కదారి పట్టిస్తున్నా దర్శకుడు పట్టించుకోలేదు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ ల పాత్రలను కూడా సరిగా ఉపయోగించుకోలేదు. అనవసర సన్నివేశాలను తొలగించి ఈ ముగ్గురి సన్నివేశాలను ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది. రజనీ కూడా ఎక్కడా ఓవర్ యాక్షన్ చేయకుండా తన పాత్ర పరిధి మేరకే నటించడం ఓ హైలైట్ అని చెప్పాలి.
రమ్యకృష్ణ పాత్ర కూడా సరిగా లేదు. నరసింహలో నీలాంబరిలాగా కాస్త పేరు తెచ్చేలా మలిచి ఉన్నా బాగుండేది. ఇంటర్వెట్ బ్యాంగ్ ఆకట్టుకుంది. బలమైన హీరో ఉన్నప్పుడు విలన్ ఇంకాస్త బలంగా ఉండాలి.కానీ వినాయకన్ పాత్ర తేలిపోయింది. తన పాత్ర పరిధి మేరకు క్రూరమైన విలన్ గా కనిపించినా ముత్తు స్టామినాకు సరిపోయే విలన్ మాత్రం కాదు. రజనీకి కొడుకును అప్పగించడానికి విలన్ టాస్క్ ఇవ్వడం కూడా ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ తరహా స్క్రీన్ ప్లే కన్నా ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా కథ రాసుకుని ఉంటే బాగుండేది.
సునీల్ పాత్ర మీద అంతగా ఎందుకు ఫోకస్ పెట్టారో అర్థం కాదు. కథకు అవసరం లేని పాత్రలపై అనవసరంగా దృష్టి పెట్టడం డైరెక్టర్ తప్పిదమే. విలన్ అడిగిన కిరీటం సంపాదించడం కోసం రజనీ చేసే ప్రయత్నాలు విసుగు తెప్పిస్తాయి. జైలర్ లాంటి బలమైన మనిషిని కాసేపు పక్కన పెట్టినట్టు కనిపించింది. అనిరుధ్ రీరికార్డింగ్ కాస్త సినిమాని నిలబెట్టింది. తమన్నా పాట, స్టెప్టులు అతి పెద్ద అట్రాక్షన్.
నటీనటులు: రజనీకాంత్, రమ్యకృష్ణ, వసంత్ రవి, సునీల్, వినాయకన్, మకరంద్ దేశ్ పాండే, యోగిబాబు, ప్రత్యేక పాత్రల్లో తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ తదితరులు.
సాంకేతిక వర్గం: కెమెరా -విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం – అనిరుధ్, నిర్మాత – కళానిధి మారన్.
దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్.
విడుదల తేదీ: 10-08-2023
ఒక్క మాటలో: అర్థంకాలేదు రాజా
రేటింగ్ – 2.75/5