తెలంగాణ, 75 ఏళ్ల క్రితం కన్నీరు కార్చింది. 70 ఏళ్ల క్రితం తుపాకీ పట్టింది. 60 ఏళ్ల క్రితం రోడ్డెక్కింది. మళ్లీ 20 ఏళ్ల క్రితం ఉద్యమంగా మారింది. ఉద్యమ నాయకులు ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. కాని ప్రజల సంకల్పం మాత్రం తొణకలేదు. అదే పట్టుదలతో ముందుకు సాగింది. అందుకే ఉద్యమ నాయకులు ఎన్ని యేషాలు వేసినా చెల్లుబాటు అయింది. తప్పులు చేసినా నాయకత్వాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అధికారం అప్పచెప్పారు. అప్పటివరకు ఉరకలెత్తిన ఎర్రటి నెత్తురు కాస్త చల్లబడింది. ఎరుపు రంగు గులాబీ రంగు పూసుకుంది. 2018లో ఎదురుదెబ్బ తింటున్నట్లే కనపడి మళ్లీ తారాజువ్వలా టీఆర్ఎస్ ఎగసిపడింది. కాని 2019లో ఎంపీ ఎన్నికల్లో దెబ్బ పడింది. ఇక 2020 మాత్రం గులాబీ బాస్ పొగరు దించింది. తల దించుకుని ఆలోచనలో పడేలా చేసింది. ఒకవైపు కాంగ్రెస్ పతనం చూస్తుంటే.. కమలం మాత్రం విచ్చుకుంది అది కూడా చాలా వయిలెంట్‌గా. గులాబీ రంగు వెలిసిపోవడం మొదలెట్టింది 2020లోనే.. కాస్త కాస్త కాషాయం రంగు అంటుకోవడం మొదలెట్టింది.
కవితకు ఎమ్మెల్సీతో ఊరట
టీఆర్ఎస్‌కు సంబంధించినంతవరకు కేసీఆర్ తన ముద్దుల కూతురు కవితకు ఎమ్మెల్సీ అందించుకుని ఊరట చెందారు. ఎంపీ ఎన్నికల పరాజయం నీడ నుంచి కాస్త బయటపడ గలిగారు. కాని వన్ సైడుగా కాంగ్రెస్, ఇతర పార్టీలను తొక్కిపారేసిన కేసీఆర్‌కి బీజేపీ మాత్రం కొరుకుడు పడలేదు. ఎందుకంటే ఈయనకు రాష్ట్రంలో పవర్ ఉంటే.. వారికి కేంద్రంలో పవర్ ఉంది. అందుకే అదురు బెదురు లేకుండా బీజేపీ ముందుకు దూకింది. పైగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి నేతలు అగ్రె సివ్‌గా అటాకింగ్ గేమ్ మొదలెట్టారు. లక్ష్మణ్, కిషన్‌రెడ్డి లాంటి స్మార్ట్ స్పీచింగ్ నేతలు కాస్త వెనుకబడ్డారు. వారిని ఎదుర్కోవడం మాత్రం కేసీఆర్ వల్ల కాలేదు.
కరోనాను ఎదుర్కోవడంలో విఫలం
కరోనా హైదరాబాద్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అసలు ఎన్నికేసులు రోజుకొస్తున్నాయో.. ఎంతమంది చనిపోతున్నారో ఎవరికీ అర్ధం కాని పరిస్ధితి ఏర్పడింది. ప్రతి ఒక్కరికి.. తమకు తెలిసినవారు కరోనా బారిన పడటంతో.. టెన్షన్ పెరిగిపోయింది. కరోనాను ఎదుర్కోవడంలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. మొదటిసారిగా జనానికి కేసీఆర్ కబుర్లు చెబుతాడు తప్పితే పని చేయడనే విషయం కాస్త గట్టిగా అర్ధమైంది. జనం నిస్సహాయంగా చచ్చిపోతుంటే ఆదుకున్న నాథుడు లేడు. మరో వైపు ఫైనాన్షియల్ క్రైసిస్. లాక్ డౌన్ దెబ్బకు వ్యాపారాలు ఆగిపాయాయి.. జీతాలు లేవు.. ఉద్యోగాలు పోయాయి.. అయినా ఎవరూ ఆదుకోలేదు. అసంతృప్తి బాగా పెరిగింది. కరోనా దానంతట అదే తగ్గటం తప్పితే.. ప్రభుత్వం చేసింది మాత్రం ఏమీ లేదు. ఈ దారుణమైన కరోనా ఎపిసోడ్ మాత్రం ప్రజల మనస్సులో గట్టి ముద్రే వేసింది. కేసీఆర్‌పై ఉన్న నమ్మకం సగంపైనే పోయింది.
వరదలతో మరో ఉపద్రవం
కరోనా ఎపిసోడ్‌ని కనుమరుగు చేసేస్తున్నామనుకుంటూ మళ్లీ ఏతులు వినిపించడం మొదలెట్టారు గులాబీ నేతలు కేసీఆర్, కేటీఆర్. కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసే పనిలో కేసీఆర్ పడ్డారు. అందుకే ఆయన ఫాంహౌస్‌లో కీలక చర్చలు జరుపుతూ.. ఫ్రంట్ ఎండ్‌లో మాత్రం కేటీఆర్‌ను అన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో నిలబెట్టసాగారు. అంతలోనే హైదరాబాద్‌లో వరదలు మరో ఉపద్రవం తెచ్చిపెట్టాయి రాజకీయంగా టీఆర్ఎస్‌కి. ఎన్నడూ లేని వర్షపాతం నమోదైంది.. దీంతో అప్పటికే వ్యవస్ధ లోపాలతో మూసుకుపోయిన నాళాల దెబ్బకు ప్రతిష్టాత్మక విశ్వనగరం నీటి పాలైంది. జనం నరకం చూశారు. మళ్లీ గులాబీపై జనం విరక్తి చెందారు. మళ్లీ ప్రభుత్వం విఫలమైంది. నేతలు, అధికారులు అందరూ మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఈ ఎపిసోడ్ కరోనా వెంటనే రావడంతో.. ఎఫెక్ట్ మరింత ఘోరంగా పడింది. టీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా ఇమేజ్ కోల్పోయింది. ఎంతలా అంటే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కంట కనపడితే చొక్కాపట్టుకుని కొట్టేంత. కాని ఏ ఎన్నికలు లేకపోవడంతో ఎవరికీ అంతగా తెలియలేదు.
దుబ్బాక ఉప ఎన్నికలో రెచ్చిపోయిన బీజేపీ
ఇంతలో దుబ్బాక ఉప ఎన్నిక వచ్చి పడింది. కరోనాతోనే దుబ్బాక ఎమ్మెల్యే చనిపోవడంతో.. ఉప ఎన్నిక తప్పలేదు. అంటే కేసీఆర్ ఇమేజ్‌పై మసి పూసిన కరోనాయే మరో ఎపిసోడ్‌కు తెర లేపింది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ రెచ్చిపోయింది. వ్యూహ, ప్రతివ్యూహాలతో అదరగొట్టేసింది. థర్డ్ ప్లేస్‌లో ఉంటుందనుకున్న బీజేపీ ఏకంగా గెలిచేసింది. ఇందుకు టీఆర్ఎస్ ఓవరాక్షన్ కూడా తోడైంది. అధికారపు అహంకారం ప్రదర్శించింది. ఆ బలం చూపించాలనుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ఒకే ఒక్క కారణం కమలనాథులను చెలరేగిపోయేలా చేసింది. అందుకే ఎదురు తిరిగారు. అప్పటికే ప్రజల్లో కేసీఆర్ చేసేదానికన్నా చెప్పేది ఎక్కువని.. పైగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుటుంబం బాగుపడింది తప్ప తెలంగాణ కాదనే ఫీలింగ్ పెరిగిపోయింది. దాంతో బీజేపీ చర్యలకు ప్రజలు ఆటోమేటిక్‌గా మద్దతు పలికారు. దుబ్బాకలో బీజేపీ విజయం గులాబీ గూబ మీద కొట్టినట్లయింది.
ఆ వెంటనే గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. అసలు వెనక్కు జరుపుదామనుకున్న టీఆర్ఎస్ ఏదో వ్యూహం రచించినట్లుగా హడావుడిగా పెట్టేసింది. కాని అదే మరింత దెబ్బ కొట్టింది. జనం ఎన్నికల రోజే ఆలోచిస్తారని అనుకోవడం ఎంత పొరబాటో కేసీఆర్‌కి తెలిసొచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మతం రంగు పులిమి క్యాంపెయిన్ చేయడంతో.. సక్సెస్ అయింది. అప్పటికే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత రావడంతో .. దానికి ఇది తోడవటంతో గ్రేటర్ ఫలితాలు కాక పుట్టించేలా వచ్చాయి. దీంతో కేసీఆర్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది.
డ్యామేజ్ కంట్రోల్ చర్యలు
అందుకే వెంటనే డ్యామేజ్ కంట్రోల్ మొదలెట్టి ముందు బీజేపీ పెద్దలతో మాట్లాడేసి వచ్చేశారు. టోన్ తగ్గించేశారు. దూకుడు తగ్గించేశారు. ఇప్పుడు మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు తాయిలాలు వదిలినట్లు.. అందరికీ మళ్లీ తాయిలాలు ఇచ్చేయటం మొదలెట్టారు. ఎల్ఆర్ఎస్ మీద వెనక్కి తగ్గారు. నియంత్రిత వ్యవసాయ విధానం మీద వెనక్కి తగ్గారు. అవి ప్రకటించినప్పుడు ప్రపంచాన్ని చదివేసినవాడిలాగా.. అపర వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు లేరు. అంతా మారిపోయారు. ఇప్పుడు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలా.. కేటీఆర్‌కి ముఖ్యమంత్రి పదవి పదిలంగా అప్పచెప్పడం ఎలా అనే దాని పైనే ఫోకస్. ఫెడరల్ ఫ్రంట్ లాంటి ఏతులన్నీ వదిలేసి చేతులు కట్టుకుని కమలం పెద్దల ముందు నిలుస్తున్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో 2019లో స్నేహగీతం ఆలపించిన కేసీఆర్, జగన్‌లు.. 2020 వచ్చేసరికి గొడవలు పడినట్లు నటించారు. ఎవరికివారు తమ రాష్ట్ర ప్రయోజనం కోసం నిలబడినట్లు ఫోజులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు. కాని జనం నమ్మినట్లు కనపడలేదు.
ఇక బీజేపీ అయితే మంచి ఊపులో ఉంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పాత్రను ఎగరేసుకుపోయింది. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అయితే కేసీఆర్ కాళ్లబేరానికి వచ్చేయడంతో.. కాస్త ఆవేశం తగ్గినట్లు కనపడుతోంది. అయినా గాని వదిలపెట్టకుండా బండి సంజయ్ విసుర్లు విసురుతూనే ఉన్నారు. లొంగిపోవడాన్ని కూడా గేలి చేస్తూ రెచ్చగొడుతున్నారు. కేసీఆర్ అదే ఊపులో ఉండుంటే.. బీజేపీ మరింత స్పీడుగా ఎదిగేది.. కాని కేసీఆర్ లొంగిపోయినట్లు నటిస్తూ బీజేపీ ముందరి కాళ్లకు బంధం వేశాడు. అసెంబ్లీలో కొన్ని సీట్లు.. పార్లమెంటరీ స్థానాలలో అత్యధిక స్థానాలు బీజేపీకి అప్పచెప్పేటట్లు ఒప్పందం ఆల్రెడీ కుదిరిపోయిందనే ప్రచారం నడుస్తోంది. ఒకవేళ ఎన్నికల టైమ్‌కి మోదీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయితే.. సోనియాకు హ్యాండిచ్చినట్లే మళ్లీ హ్యాండివ్వటం కేసీఆర్‌కు పెద్ద పని కాదు.
కాంగ్రెస్‌కు చేదు అనుభవాలు
ఇక ఎటొచ్చి కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఇంకా డోలాయమానంలో ఉంది. దానికి కనపడుతున్న ఒకే ఒక్క ఆశ రేవంత్‌రెడ్డి. 2020 నిజంగా కాంగ్రెస్‌కు చేదు అనుభవాలు మిగిల్చింది. దుబ్బాకలో పరువు పోయింది. గ్రేటర్‌లో ఘోర పరాజయం ఎదురైంది. ఒక్క నాయకుడు కూడా మరో నాయకుడితో కలిసి పని చేసే పరిస్ధితి లేకుండా పోయింది. అదే సమయంలో కేంద్ర స్థాయిలో కూడా నాయకత్వ సంక్షోభం రావడంతో.. కాంగ్రెస్ దారుణంగా నలిగిపోయింది. జనం కాంగ్రెస్ అంటే లెక్క చేసే పరిస్ధితి కూడా లేకుండా పోయింది. కాని 2020 చివర్లో రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు చేస్తున్నారనే వార్తలు.. మరోవైపు రాహుల్ గాంధీ సైతం పగ్గాలు చేపట్టడంతో కాస్త ఆశలు రేకెత్తాయి. ఇప్పుడున్న పరిస్ధితుల్లో బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యారనే విషయాన్ని ఎక్స్ పోజ్ చేయగలిగితే.. మళ్లీ కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉంది. మరి అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి.
వామపక్షాల పరిస్ధితి మరీ ఘోరం
ఇక వామపక్షాల పరిస్ధితి మరీ ఘోరంగా తయారైంది. కాస్తో కూస్తో కేడర్ ఉండటంతో.. ఇంకా ముందుకు వెళుతున్నాయి. ఒంటరిగా నెగ్గుకు రాలేక.. పొత్తులకు అలవాటుపడ్డ వామపక్షాలకు.. కేసీఆర్ , బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడం.. వ్యవసాయ చట్టాలపై రెచ్చిపోవడం.. కమ్యూనిస్టులా మాట్లాడటంతో.. వెంటనే వామపక్ష నేతలు కేసీఆర్‌తో కలిసి పని చేయటానికి సిద్ధమని చెప్పారు. ఖమ్మం మున్సిపాలిటీలో పొత్తుకు కూడా రెడీ అయిపోయారు. కాని ఎన్నికల ఫలితాలు చూశాక తెలివి పెంచుకున్న కేసీఆర్ బీజేపీతో కలిసిపోయినట్లు కనపడుతుండటంతో.. వామపక్షాలు ఇప్పుడు బిక్కమొహం వేశాయి.
అలా మొత్తానికి గులాబీ రంగు తగ్గి తెలంగాణకు కాషాయం రంగు పులుముకుంటోంది. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా.. కాంగ్రెస్ ఏమైనా పుంజుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది.