(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా రామతీర్ధంలోని నీలాచలం కొండపైగల శ్రీ కోదండరామస్వామి ఆలయంలోగల విగ్రహ ధ్వంసం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో రాష్ట్ర సీఐడీ అదనపు డిజి పి.వి.సునీల్ కుమార్ మంగళవారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయనతో పాటు, సీఐడీ డిఐజి హరికృష్ణ, విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్. కే.వి.రంగారావు, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఇతర పోలీసు అధికారులు విగ్రహ ధ్వంసం జరిగిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంను సందర్శించారు. నేరం జరిగిన తీరును, ఇప్పటి వరకు పోలీసుశాఖ చేపట్టిన దర్యాప్తు, సాధించిన ప్రగతిని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి సీఐడీ అధికారులకు వివరించారు. అదనపు డిజి ఆలయం చుట్టూ పరిశీలించి, దుండగులు ప్రవేశించిన తీరు, విగ్రహ ధ్వంసం జరిగిన తీరును నిశితంగా పరిశీలించారు. అనంతరం, విగ్రహ శిరస్సు భాగం, యాక్సా బ్లేడు లభ్యమైన కోనేరు ప్రాంతాన్ని పరిశీలించారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ..
ఈ సందర్భంగా అదనపు సునీల్ కుమార్ మాట్లాడుతూ సాధారణంగా నేరం చేసేందుకు సహజంగా నిందితులకు ఒక లక్ష్యం అంటూ ఉంటుందన్నారు. నిందితులు లాభం కోసం, లబ్ధి కోసం లేదా కోపంతోను, కక్షతోను చేసే అవకాశం ఉంటుందన్నారు. నేరస్థులు ఈ రెండు కారణాలతోనే సాధారణంగా నేరాలకు పాల్పడతారన్నారు. ఈ సంఘటనను పరిశీలిస్తే ఈ ఆలయంలో ఎటువంటి విలువైన వస్తువులు దొంగిలించలేదన్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు, సమాజంలో వర్గాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టేందుకు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నారు. కావున, ఈ దిశలోనే దర్యాప్తు చేపట్టి, కేసు మిస్టరీని ఛేదిస్తామన్నారు. నీలాచలం కొండ పైనగల ఈ ఆలయం కూడా రోడ్డు ప్రక్కన ప్రజలకు అందుబాటులో లేదు. ఈ నీలాచలం కొండ మీదకు చేరుకోవాలంటే ఎంతో ప్రయాస పడి మాత్రమే 400 మీటర్లు ఎత్తునకు చేరుకోవాల్సి ఉంటుందని, పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు లేదా వారి సహకారంతోనే వేరే వారు ఈ చర్యకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా, ఈ చర్యలు ఆకతాయిలు చేసిన పని కూడా కాదన్నారు. ఎందుకంటే నిందితులు ముందుగా సిద్ధమై, యాక్సా బ్లేడు సహాయంతో విగ్రహం మెడ భాగాన్ని కోసి, తలను ఉద్దేశ్యపూర్వకంగా వేరు చేసి, ఆలయం ప్రక్కన ఉన్న కోనేటిలో పడేశారన్నారు. ఈ నేరం అంతా పక్కా ప్రణాళికతో మాత్రమే చేసి ఉండవచ్చునని ప్రాధమిక విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ కేసు మిస్టరీని ఛేదిస్తామని, దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తామని సీఐడీ అదనపు డిజి తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే సీఐడీ అధికారులకు తెలియ పరచాలని ప్రజలను సునీల్ కుమార్ కోరారు.