ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ పండగులా జరుగుతోంది. అయితే, ఇళ్ల పట్టాల పంపిణీలో కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు మాత్రం ఊహించని పరిణామం ఎదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీకి మిడ్తూరు మండలం చౌట్కూరు వెళ్లిన ఎమ్మెల్యేకు జనం అంతా ఎదురు వచ్చి పూలు చల్లి, తప్పెట్లతో ఘన స్వాగతం పలికారు. ఇక ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టారు. అయితే ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు చేతిలోకి తీసుకుని పేర్లు పిలిచారు. ఒక్కరు రాలేదు. అందరూ అక్కడే ఉన్నారు. కానీ ఎవ్వరూ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలు తీసుకోలేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ఖంగుతిన్నారు. ఎందుకు ఇళ్ల పట్టాలు తీసుకోవడం లేదని లబ్దిదారులను అడగి తెలుసుకుని, మరోసారి ఖంగుతిన్నారు.
ఎందుకు తీసుకోలేదంటే..
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో చౌట్కూరు చాలా చిన్న గ్రామం. ఈ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య దారి కూడా లేని భూమిని ఇళ్ల పట్టాల కోసం సేకరించారు. అక్కడికి వెళ్లడానికి అసలు దారే లేదు. అధికారులు సిద్ధం చేసిన లేఅవుట్‌ను చూడాలని ఎమ్మెల్యే ఆర్థర్‌ను జనం పట్టుపట్టడంతో ఆయన కాలినడకన గంటన్నర నడిచి ఎట్టకేలకు అక్కడకు చేరుకుని పరిశీలించి అవాక్కయ్యారు. ఇంత దూరంలో కనీసం మట్టి దారి కూడా లేకుండా పట్టాలు ఎలా ఇస్తారని ఆయన అధికారులను కడిగిపారేశారు.
మహామేత మేశారు
ఇళ్ల స్థలాలకు సేకరించిన భూమిని ఎకరా రూ.12 లక్షల చొప్పున నాలుగున్నర ఎకరాలు కొనుగోలు చేశారు. తీరా అక్కడ ఎకరా ఎంత పలుకుతోందని ఎమ్మెల్యే స్థానికులను ప్రశ్నించారు. ఎకరా రూ.5 లక్షలు మించదని చెప్పారు. దీంతో అధికారులపై ఆర్థర్ రెచ్చిపోయారు. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేసుకున్నారు. విషయం జేసీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి దగ్గరలో భూమి కొనుగోలు చేసి ప్లాట్లు వేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పడంతో ఆర్థర్ శాంతించారట.