జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఆయన పార్టీ టికెట్ పై ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ఏకంగా సీబీఐ కోర్టునే ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇప్పటికే నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు పలు దఫాలుగా విచారణ చేపట్టింది. తాజాగా కోర్టు ఈ విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ వాయిదాలో తప్పననిసరిగా తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే ఈ పిటిషన్ విచారణపై సీబీఐ తీవ్ర జాప్యం చేసింది. ఈ జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. 26న తన కౌంటర్ దాఖలు చేయాలని, ఒకవేళ కౌంటర్ దాఖలు చేయకున్నా.. అదే రోజు తన తుది నిర్ణయం ప్రకటిస్తానని కూడా కోర్టు తేల్చి చెప్పింది.
జగన్ బెయిల్ రద్దేనా?
ఓ వైపు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని రఘురామరాజు కోరుతుండటం, ఇదివరకే ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ పలుమార్లు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడం.. దానిపై కోర్టుల్లో సుదీర్ఘ విచారణలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కూడా జగన్ బెయిల్ ను రద్దు చేయొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ బెయిల్ రద్దు ఖాయమే అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాంటి విశ్లేషణల నేపథ్యంలో జగన్ కు బెయిల్ రద్దు అయితే ఏం జరుగుతుంది? అసలు బెయిల్ రద్దు అవుతుందా? ఈ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామరాజు పిటిషన్ దాఖలు చేయడం సబబేనా? రఘురామ అనర్హత పిటిషన్ పై లోక్ సభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? వంటి అంశాలపై సీపీఐ నేత కె. నారాయణ తనదైన మార్కు విశ్లేషణ చేశారు.
రఘురామపై వేటు ఖాయమే
జగన్ బెయిల్, రఘురామ అనర్హత పిటిషన్లపై ఆయన నారాయణ ఏమంటారంటే.. **జగన్ బెయిలు రద్దు చేయాలని ఆయన పార్టీకి చెందిన రఘురామ పిటిషన్ వేయడం తప్పు. పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో ఈటెల రాజేంద్ర తరహాలో పోరాటం చేసి ఉంటే బాగుండేది. ఒక వేళ ఆయన కోరుకున్నటు జగన్ బెయిలు రద్దు అయితే ఏమి అవుతుంది? ఇంతకు ముందే జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు. ఆ సింపతితో ఎన్నికల్లో గెలిచారు. మరోసారి జైలుకు వెళితే ఆయన అర్ధ ఆయుష్షు సంపూర్ణ ఆయుష్షు గా మారుతుంది. జైలుకు పంపి రాజకీయాలు మార్చాలి అనుకోవడం అవివేకమే. ఎంపీ రఘురామ సభ్యత్వ రద్దు ఖాయం. జగన్ బెయిలు రద్దు అవుతుందో లేదో కానీ రఘురామ పార్లమెంటు సభ్యత్వం రద్దు అవుతుంది. జగన్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ విధానాలు వ్యతిరేకంగా నిత్యం వ్యవహరిస్తున్న రఘు రామ సభ్యత్వాన్ని రద్దు చేయమని కొరడంలో తప్పు లేదు. గతంలో రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు .. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రాగానే శరద్ యాదవ్ సభ్యత్వాన్ని రద్దు చేశారు** అంటూ నారాయణ తనదైన స్టైల్లో కుండబద్దలు కొట్టేశారు.











