జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇసుక విధానం ద్వారా రూ.వేల కోట్లు దండుకున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా వారు ఏకంగా రూ.2,566 కోట్లు దోచేసినట్లుగా చెబుతున్నారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వైసీపీ అగ్ర నేతలకు అన్ని విషయాల్లోనూ సాయం చేశారు. అందుకే ఇప్పుడు విచారణ చేస్తుండగానే దొరక్కుండానే పారిపోయారు. ఇసుక కాంట్రాక్ట్ సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు వీజీ వెంకట్ రెడ్డి అనేక కుట్రలకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో సదరు సంస్థలు ఇష్టారీతిన ఉల్లంఘనలు చేసినా వారికి అండగా నిలిచారు.
ఏసీబీ గత నెల రోజులుగా చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ స్కామ్ కు సంబంధించిన కీలక అంశాలు, ఆధారాలు బయటికి వచ్చాయి. దీంతో వీజీ వెంకట రెడ్డిపై బుధవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలను, వాటి ప్రతినిధులను నిందితులుగా చేర్చింది. నేరపూరిత విశ్వాస ఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టింది. దర్యాప్తులో భాగంగా ఆ కంపెనీల ఆఫీసులు, వీజీ వెంకటరెడ్డి, వేరే నిందితుల ఇళ్లల్లో గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. గత 2 నెలలుగా పరారీలో ఉన్న వెంకటరెడ్డి ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో ఆయన కోసం ఆరా తీస్తోంది.
ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో వెంకట రెడ్డి ఒక్క నిబంధన కూడా పాటించలేదని ఏసీబీ ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇసుక కాంట్రాక్టర్ సంస్థ జేపీవీఎల్ సంస్థ ప్రభుత్వానికి రూ.800 కోట్ల బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థ సమర్పించిన రూ.120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునేందుకు ఎన్‌ఓసీ జారీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వెంకటరెడ్డి తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు లబ్ధి చేకూర్చి, దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు గుర్తించారు. అన్ని జిల్లాల్లోని గనుల శాఖ కార్యాలయాలు, ఇసుక రీచ్‌లను ఏసీబీ అధికారులు సందర్శించారు. దీంతో కీలక ఆధారాలు సేకరించాయి. వాటి ఆధారంగానే తాజా కేసులు నమోదు చేశారు.
ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ 2021లో తీసుకొచ్చిన ఇసుక విధానంలో కాంట్రాక్టు సంస్థలు పాటించాల్సిన నిబంధనల జాబితా ఉంది. కానీ, జగన్ హాయాంలో ఏవీ అమలు కాలేదు. అందుకు విరుద్ధంగా వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. జగన్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వెంకటరెడ్డి ఈ అక్రమాల విషయంలో బాగా సహకరించారు. దీంతో తనిఖీల్లో భాగంగా రాయచోటి పట్టణంలోని వెంకట్ రెడ్డి అత్తగారింట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తీవ్ర అవినీతి ఆరోపణలు వెంకట్ రెడ్డిపై రావడంతో, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆయన్ను పదవి నుంచి తప్పించి, ఈ విచారణ జరిపిస్తోంది.