వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు వివిధ అక్రమ మార్గాల్లో దోచుకున్న తాలుకూ వ్యవహారాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఒక్కో నేతకు చెందిన లోగుట్టు వ్యవహారం, దోపిడీ సంగతులు క్రమంగా వెలుగులోకి వస్తుండగా.. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని బాగోతం బయటికి తెలిసింది. మాజీమంత్రి విడదల రజిని అధికారంలో ఉన్నప్పుడే.. పలు అవినీతి పనులకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతూ ఉండేది. కానీ, అధికార బలం కారణంగా ఆమె వ్యవహారాలు అంతగా బయటికి వచ్చేవి కావు. రజిని గురించి అప్పటి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కు తెలిసినా కూడా ఆయన పట్టించుకోలేదు. కనీసం జగన్ అడ్డుకట్ట వేయలేదు.
ప్రజా ధనాన్ని దండుకుంటే రాబోయే ఎన్నికల కోసం ఆ డబ్బు ఉపయోగపడుతుందనే ఉద్దేశం ఆయనకు ఉండవచ్చు. లేదా తమ పార్టీ నేతలు ఆర్థికంగా బలవంతులు అయితే వైసీపీ బలంగా ఉంటుందనే అభిప్రాయం కావచ్చు. మొత్తానికి జగన్ విడదల రజినినే కాక మరే ఇతర నేత అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేయలేదు. అలా మంత్రులు, వైసీపీ నేతల కారణంగా ఎంతో మంది ప్రజలు బాధితులు అయ్యేవారు. ఈ క్రమంలోనే విడదల రజిని బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడారు.
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బాధితులు అంతా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు, కొన్ని చోట్ల పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. విడదల రజిని జగనన్న కాలనీ పేరిట తమవద్ద భూములు సేకరించి కమీషన్లు వసూలు చేశారని, అవి ఇప్పించాలని జూన్‌లో చిలకలూరిపేట మండల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును కలిసి మొరపెట్టుకున్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు, గుడిపూడి గ్రామాల రైతుల నుంచి 200 ఎకరాలను మాజీమంత్రి రజిని అనుచరులు సేకరించారు. దాదాపు 32 మంది నుంచి తొలుత 50 ఎకరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో తమకు రజిని నుంచి రూ.1.16 కోట్లు రావాల్సి ఉందని రైతులంతా పోలీసులు, ఎంపీకి ఫిర్యాదు చేయగా.. ఆ మొత్తాన్ని ఇప్పించారు.
తాజాగా రజిని వ్యవహారం మరొకటి బయటికి వచ్చింది. తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేకపోతే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని రజిని తనను బెదిరించారని ఓ స్టోన్‌క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు మరో ముగ్గురు కలిసి స్టోన్‌క్రషర్ నడిపిస్తుంటే మాజీమంత్రి రజిని బెదిరించారని యడ్లపాడుకు చెందిన నల్లపనేని చలపతిరావు ఆరోపించారు. ఆమెకు వత్తాసుగా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా కూడా డబ్బులు ఇవ్వకపోతే రూ.50 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బాధితులను వేధించారు. దీంతో చేసేదిలేక రూ.2.20 కోట్లు రజినికి, ఆమె అనుచరులకు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. వాటిని ఇప్పుడు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.











