వైసీపీలో నుంచి కొద్ది రోజుల క్రితం వరుసగా నేతలు రాజీనామాలు చేస్తూ కలకలం రేపారు. ఇప్పుడు మరో కీలక నేత వైదొలగడానికి రంగం సిద్ధం అవుతోంది. ఆయన జగన్ కు బంధువు కూడా అవుతారు. ఆయనే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జంకె వెంటకరెడ్డి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించాలని జగన్ భావించినా జిల్లా నాయకులు వ్యతిరేకించారు.
బాలినేని బుధవారం సాయంత్రం తాడేపల్లిలో జగన్ రెడ్డిని కలిశారు. 4 రోజులుగా పదేపదే జగన్ నుంచి అందిన పిలుపుతో ఆయన కలిసినట్లు తెలిసింది. వెంటనే జగన్ జిల్లా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకోవాలని, తిరిగి రాజకీయంగా చురుకైన పాత్ర పోషించాలని సూచించినట్లుగా తెలిసింది. అయితే ఆ ప్రతిపాదనను బాలినేని తిరస్కరించినట్లు తెలిసింది. తనకు పదవులు వద్దని చెప్పటంతోపాటు ఇప్పట్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఆలోచన కూడా లేదని చెప్పినట్లు తెలిసింది.
దీంతో ఒంగోలు జిల్లా పార్టీ నేతలతో జగన్ శుక్రవారం భేటీ అవనున్నారు. జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన నాయకులు, ఇతర ముఖ్య నాయకులకు జగన్ వద్ద సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానం అందింది. బాలినేనికి కూడా ఈ ఆహ్వానం అందింంది. అయితే, ఈ సమావేశానికి హాజరయ్యేందుకు బాలినేని సుముఖత చూపలేదని అంటున్నారు. శుక్రవారం సమావేశానికి బాలినేని రాకపోయినా కూడా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవిని మరొకరికి కట్ట బెడతారా? అనేది కూడా చర్చనీయాంశం అయింది.
ఇక జిల్లాలోను వైసీపీకి గుడ్‌బై చెప్పే వారి జాబితా పెరిగిపోయింది. తాజా పరిణామాలతో బాలినేని శ్రీనివాస్ కూడా జగన్ కు గుడ్ బై చెబుతారని అంటున్నారు. ఆయన జనసేనలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. జనసేనకు చెందిన ఒక నాయకుడు బాలినేనికి టచ్‌లో ఉన్నారని అంటున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌తో కలిసి జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ సీఎం చంద్రబాబును కలిసి బాలినేని పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని గతంలోనే కోరారు. అయితే, ఒక జనసేన ముఖ్య నాయకుడు రియాజ్‌కు ఫోన్ చేసి ఏదైనా ఫిర్యాదు చేయదల్చుకుంటే పవన్‌కళ్యాణ్‌కు చేయాలిగాని, టీడీపీ అధి నేత వద్దకు వెళ్లటం కరెక్టు కాదని చెప్పినట్లు తెలిసింది. ఇదేసమయంలో వారం క్రితం కొందరు బీజేపీ నా యకులు హైదరాబాద్ వెళ్లి బాలినేనిని కలిసి పార్టీలో చేరాలని కోరినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని జగన్‌ను కలిసి పార్టీ పదవులు ఏం వద్దని.. వైసీపీ కార్యక్రమాలకు కూడా తాను దూరంగా ఉంటానని చెప్పటం ఆయన జగన్ ను వీడి పోతారనేందుకు బలం చేకూరుస్తోంది