గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇటీవల స్థానిక ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి, ఈ మేరకు ఓ రిపోర్టును అందజేసింది. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. దీంతో విజయవాడ గ్రేటర్ విజయవాడగా మారబోతుందనే ఆశలు మళ్లీ చిగురించాయి.
విజయవాడ మహా నగరానికి అడుగులు పడాల్సిన సరైన సమయమిదే. ఇప్పటికే విజయవాడకు చుట్టుపక్కల ఉన్న మైలవరం, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని..అనేక గ్రామాలు, తాడిగడప లాంటి మున్సిపాలిటీలు అనధికారికంగా విలీనమైనా.. నగరపాలికలో భాగం కాకపోవడంతో అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. విజయవాడ మహానగరమైతే విస్తీర్ణం భారీగా పెరుగుతుంది. జనాభా 20 లక్షలపైనే ఉంటుంది. దీంతో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద భారీగా నిధులు వస్తాయి. సీనియర్ IAS అధికారులు కమిషనర్లుగా ఉంటారు. వేగంగా అభివృద్ధి చెందే వీలుంటుంది.
నగరానికి ఆనుకుని ఉండే.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రాంతాలే కాకుండా గుంటూరు పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు కూడా దాదాపు విజయవాడతో కలిసిపోయాయి. వీటిని కూడా విలీనం చేస్తే.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఏర్పడుతుంది. భవిష్యత్తులో చుట్టుపక్కల ఉండే.. గుంటూరు, తెనాలి, పరిటాల, గన్నవరం, కంకిపాడు వరకూ..నగరం విస్తరిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో అధికారులు మరింత వేగంగా చర్యలు చేపడితే దశాబ్దాల కల సాకారమవుతుంది.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2011 లెక్కల ప్రకారం..10.34 లక్షల జనాభా ఉంది. విలీనం చేయబోయే 74 గ్రామాల పరిధిలో ఉన్న 5.54 లక్షలతో కలిపి 15.88 లక్షలవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లలో నగర జనాభా 20 శాతానికి పైగా పెరిగింది. విలీన గ్రామాల్లోని పెరుగుదలతో కలిపితే కనీసం నాలుగైదు లక్షలు అదనంగా ఉంటుంది. ఈ లెక్కన గ్రేటర్ జనాభా.. ప్రస్తుతం అనధికారికంగా 20 లక్షలకు పైనే ఉంటుంది. విజయవాడ శివార్లలోని 7 మండలాల్లోని గ్రామాలు విలీనం కానున్నాయి. ఇబ్రహీంపట్నం-13, విజయవాడ రూరల్ -19, జి.కొండూరు-02, కంకిపాడు-11, పెనమలూరు- 08, గన్నవరం-19, ఉంగుటూరు పరిధిలో 2 గ్రామాలున్నాయి. తాడిగడప, కొండపల్లి మున్సిపాలిటీలు 2 విలీనం కానున్నాయి.
విజయవాడలో ఇప్పటికే జక్కంపూడి, గొల్లపూడి, కానూరు, పోరంకి, తాడిగడప, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి ఇవన్నీ పూర్తిగా కలిసిపోయాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఉండడంతో అభివృద్ధికి దూరంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేవు. జక్కంపూడి, YSR కాలనీలు నగరంలో అనధికారికంగా భాగమైపోయాయి. అత్యధిక మందికి గుర్తింపు కార్డులు కూడా విజయవాడలోనే ఉన్నాయి. 30 వేలకు పైగా ఇక్కడ ఓట్లుంటే.. కేవలం 13 వేలు మాత్రమే మైలవరంలో ఉన్నాయి. శివార్లలోని అన్ని గ్రామాల పరిస్థితీ ఇదే.
తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లోనూ 2014 తర్వాత జనాభా 20 శాతానికి పైగానే పెరిగిందని అంచనా. తాడేపల్లి, మంగళగిరి పేరుకు గుంటూరు జిల్లాలోనే ఉన్నా..ఎక్కువగా ఆధారపడేది విజయవాడపైనే. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కూడా గ్రేటర్ విజయవాడలో విలీనం చేస్తే నగర పరిధి భారీగా పెరుగుతుంది. గ్రేటర్ విజయవాడ విస్తీర్ణం 661.79 చదరపు కిలోమీటర్లు అవుతుంది. తాడేపల్లి, మంగళగిరి కూడా కలిస్తే మహానగరపాలక సంస్థగా మారుతుంది.
గ్రేటర్ విజయవాడకు అడ్డంకులివే –
గ్రేటర్ ఏర్పాటుకు డిసెంబర్ 31లోగా నోటిఫికేషన్ కచ్చితంగా ఇస్తేనే.. ప్రక్రియ పట్టాలెక్కుతుంది. లేదంటే జనవరిలో జనగణన ప్రారంభమవుతుంది. అధికారులంతా పనుల్లో బిజీ అవుతారు. ఆ తర్వాత పంచాయతీల ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికలు జరిగితే ఈ పంచాయతీలకు కొత్త సర్పంచులొస్తారు. ఎన్నికైన వెంటనే విలీనమంటే కొత్త సర్పంచులు అంగీకరించరు. దీంతో గ్రేటర్ ప్రతిపాదన మళ్లీ మొదటికొస్తుంది. విలీన ప్రాంతాల్లో గ్రామసభలు పెట్టి తీర్మానాలు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలంటే.. ఈ నెలాఖరులోగా పూర్తవడం కష్టం. అందుకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి..గెజిట్‌ను విడుదల చేస్తే.. వెంటనే ప్రక్రియను ప్రారంభించవచ్చని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిని పెంచి 300 డివిజన్లుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇలాగే గెజిట్‌ను విడుదల చేసింది. ఇదే విధానం ఇక్కడా అమలు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.











