ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మినహాయింపు ఏమీ లేదు. అవినీతి, అక్రమాస్తుల కేసులో విచారణకు ఏ1 గా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏ2 గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చేసింది. హైదరాబాదులోని సీబీఐ కోర్టులో జగన్ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. జగన్.. ఏపీ సీఎం అయిన తర్వాత.. నేరుగా కోర్టుకు హాజరు కావడం నుంచి మినహాయింపు అడిగారు. ఇన్నాళ్లు అనుమతించినప్పటికీ.. జగన్ గానీ, విజయసాయిరెడ్డి గానీ నేరుగా కోర్టుకు రావాల్సిందేనని జగన్ తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అడిగిన జగన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. విచారణకు, హోదాకు సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఆ మేరకు ఈనెల 10వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని తీర్పు చెప్పింది.
సీఎం హోదాలోనూ తప్పదా?
జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసులకు సంబంధించి.. సీబీఐ కోర్టులో ప్రతి శుక్రవారం విచారణలు జరుగుతున్నాయి. జగన్ గతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా.. ఆ కారణం మీద తనకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు కావాలని కోరారు. అయితే కోర్టు అప్పట్లోనూ తిరస్కరించింది. దాంతో ప్రతి గురువారం నాటికి ఎక్కడివరకు పాదయాత్ర సాగితే అక్కడ ఆపేసి, హైదరాబాదులోని కోర్టుకు వచ్చి, తిరిగి వెళ్లిన తర్వాత.. శనివారం పాదయాత్ర పునఃప్రారంభిస్తూ.. జగన్ కొనసాగించారు. సీఎం అయిన తర్వాత.. ఇన్నాళ్లూ మినహాయింపు లభించింది. అయితే ఆ పిటిషన్ లో తీర్పు వెలువరిస్తూ.. అలా కుదరదని.. హోదా ఏదైనా సరే.. నేరానికి సంబంధించి కోర్టుకు రావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చేసింది.
Also Read: 2020 రివ్యూ : ఆదాయం లేక అప్పులు.. పథకాల పప్పు బెల్లాలు











