ఒకసారి ఆ బాణం వదిలారు. గురి తప్పలేదు. లక్ష్యం నెరవేరింది. మళ్లీ అదే బాణం ఇక్కడా వదిలారు. ఈసారి గురి తప్పకుండా లక్ష్యం నెరవేరుతుందా? లేక బాణం వదిలిన పేరు మాత్రమే మిగులుతుందా? హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ వదిలిన హిందూత్వ బాణం గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు పనికొచ్చింది. ఇప్పుడు అదే హిందూత్వ బాణాన్ని తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా వదిలింది. అది కూడా హైదరాబాద్ నుంచే.. అది కూడా బండి సంజయ్ నుంచే. అంటే బీజేపీ అధిష్టానానికి బండి సంజయ్ నోటి దూకుడు మీదే నమ్మకం ఎక్కువుందా? తాటాకా చప్పుళ్లు చేసే సోము వీర్రాజు మీద భరోసా పోయిందా? ఏమో.
కాకతాళీయమో.. లేక పన్నాగమో..?
తిరుపతి ఉప ఎన్నికకు ముందు మరి కాకతాళీయమో.. లేక పన్నాగమో తెలియదు గాని.. హిందూ దేవాలయాల్లో ధ్వంస రచన నడుస్తోంది. చిన్న చిన్న గుళ్లలోనూ.. అలాగే రామతీర్ధం లాంటి చారిత్రాత్మక దేవాలయాల్లోనూ విధ్వంసం జరిగింది. ఒక్కటంటే ఒక్క చోట కూడా ఏ నిందితుడిని పట్టుకోలేకపోయారు పోలీసులు. ప్రభుత్వ వైఫల్యం అంటూ టీడీపీ రోడ్డెక్కింది. అసలు టీడీపీయే కుట్ర పన్ని విధ్వంసం చేస్తోందని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అలా హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌లోకి బండి సంజయ్ నుంచి హిందూత్వ అజెండాను పంపించారు.
డైరెక్టుగా హిట్టింగ్
బైబిల్ కావాలా.. భగవద్గీత కావాలా.. అంటూ డైరెక్టుగా హిట్టింగ్ చేశారు. ఇక్కడ ముస్లింలు టార్గెట్ అయితే.. ఏపీలో క్రైస్తవులు టార్గెట్ అయ్యారు. అంటే జగన్మోహన్‌రెడ్డి వైసీపీ క్రిస్టియన్ల వైపు నిలబడినట్లు.. బీజేపీ హిందువుల వైపు నిలబడినట్లుగా సూత్రీకరించారు. తెలంగాణలో ఇలా చేసే కాంగ్రెస్‌ను పడుకోబెట్టారు. బహుశా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని అలాగే పడుకోబెట్టాలనేది ప్లాన్ కావొచ్చు. ఇదే పని సోము వీర్రాజుతో చేయించొచ్చు కదా.. అరువు తెచ్చుకుని మరీ బండి సంజయ్ తో అనిపించనేల అనే అనుమానం రావొచ్చు.
బీజేపీ వ్యూహాం ఒకటే..
బీజేపీ వ్యూహాం ఒకటే లక్ష్యం దిశగా నడుస్తుంది. ప్రత్యర్ధులు ఇద్దరున్నప్పుడు.. ముందు ఒకరిని దెబ్బ కొట్టి ఆ తర్వాత అసలైన వాడిని కొడుతుంది. అందుకోసం అవసరమైతే ఎవరితోనైనా చేతులు కలుపుతుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను రీప్లేస్ చేసి టీఆర్ఎస్‌ను ఢీకొట్టింది. ఈ వ్యూహంలో టీఆర్ఎస్ దెబ్బ తిన్నా సరే వెనకాడే సమస్య లేదు. ఇప్పుడు కేసీఆర్ శరణు కోరి రావడంతో దూకుడు తగ్గించింది. కాని రేపు అవసరమైతే కేసీఆర్ రాజకీయ బలాన్ని సంహరించడానికి వెనుకాడదు.
ఏపీలోనూ వైసీపీకి సహకరిస్తూనే.. దానిని విమర్శిస్తూ.. టీడీపీ బలాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో వైసీపీకి దెబ్బ తగిలినా పట్టించుకోదు. కాని సోము వీర్రాజు పట్టించుకుంటాడు. అవును జగన్‌కు నొప్పి తగిలే ఏ కార్యక్రమం అయినా సరే ఇతర నాయకులు పాల్గొంటారు గాని .. సోము వీర్రాజు పక్కకు వెళ్లిపోతారు. ఇదే రామతీర్ధం ఘటన తెలంగాణలో జరిగి ఉంటే.. బండి సంజయ్ ఉగ్రరూపం చూపించేవాడు.. అది జగన్‌కు నష్టమా, లాభమా అని ఆలోచించేవాడు కాదు.. బీజేపీకి లాభమా, నష్టమా చూసుకునేవాడు. అదే సోము వీర్రాజు అయితే తాను రెచ్చిపోతే జగన్‌కు ఇబ్బందేమో.. అని ఆలోచించే రకం. అందుకే జగన్ కు ఇబ్బంది కలిగించే ఏ ఎపిసోడ్‌లోనూ ఎంటర్ కాడు. ఈ విషయం అర్ధమయ్యే బహుశా బీజేపీ అధిష్టానం కర్తవ్యాన్ని బండి సంజయ్ చేతిలో పెట్టినట్టుంది. ఈ సోము వీర్రాజు అటు ఇటు చేసి మళ్లీ ఎదురు దెబ్బ తినేలా చేస్తాడని భయపడుతున్నట్లుంది. పక్క రాష్ట్రం నుంచి బండి సంజయ్‌ను అరువు తెచ్చుకుని వాడుకున్నా పర్వాలేదని చెప్పినట్లుంది. అయితే, బండి సంజయ్ నోటి దూకుడు ఏపీలో చెల్లడం కష్టమే. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అంత బలహీనంగా తెలుగుదేశం లేదు. బండి సంజయ్ దెబ్బకు వైసీపీ ఓట్లకు గండి పెరుగుతుందేమో గాని.. టీడీపీకి కాదు.