బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహిరి మరణించారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. బప్పీలహిరి అసలు పేరు అలోకేష్ లాహిరి. ఆయన వయసు 69 ఏళ్లు. 1952 నవంబర్ 27న బెంగాల్‌లో బప్పీలహరి జన్మించారు. భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారాయన. బప్పీ లహిరి 1970,80 చివరలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలకు సూపర్ పాటలను అందించారు.ఈ పాటలు అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి. దీంతో బప్పీలహరి పేరు మారుమ్రోగింది.
2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే… బప్పీలహరి సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సింహాసనం సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆతర్వాత చిరంజీవి స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్, రమేష్ బాబు సామ్రాట్ తదితర చిత్రాలకు సంగీతం అందించారు.
హిందీ, తెలుగు, బెంగాళీ, తమిళం, కన్నడ, గుజరాతీ చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇటీవల డిస్కోరాజా చిత్రంలోనూ ఆయన పాట పాడారు. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.











