ఆ నాలుగు జిల్లాల్లో హై అలర్ట్ ..!
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అవి జనవరి నెలాఖరు నాటికి వందల సంఖ్యలో పెరిగిన ఆశ్చర్య పోనక్కర్లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. వీటికి తోడు కరోనా కేసులు వందల సంఖ్యలో గతంకన్నా ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. 19న కువైట్ నుంచి విజయవాడకు వచ్చిన ఆమె, అక్కడి నుంచి స్వస్థలమైన అయినవల్లి మండలం నేదునూరుకు వెళ్లింది. ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. సదరు మహిళ భర్త, పిల్లలకు కరోనా పరిక్షలు చేయగా .. నెగటివ్ వచ్చిందని అదనపు డీఎంహెచ్ వో వెల్లడించారు. విశాఖలో కూడా ఒక కేసు నమోదు అయింది. 15న దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. వీరిని హోం ఐసొలేషన్ లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. కాంటాక్ట్ హిస్టరిని సర్వే చేసి, రక్త నమూనాలను సేకరించే పనిలో పడ్డారు వైద్యారోగ్యశాఖ అధికారులు. విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలో వైద్య అధికారులు హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. తూగో, విశాఖ లో నమోదైన రెండు ఒమిక్రాన్ కేసులతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారంతో నాలుగు కేసులకు చేరింది!











