విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘నారప్ప’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో మంచి విజయం సాధించిన ‘అసురన్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా వెంకటేష్ భార్య పాత్రలో ప్రియమణి నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కాని కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత వెంకీ ‘ఎఫ్ 3’లో నటించనున్నారు.
ఇక ఈ సినిమాతో పాటుగా వెంకీ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ నటించనున్నాడు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ గుర్రపు పందేల బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్నట్లు సమాచారం. ఇందులో వెంకీ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర వినోదాత్మకంగా ఉంటుందని, ఆయన నటన వైవిధ్యంగా ఉంటుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేష్ బాబు నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభింబోతున్నట్లు సమాచారం.
గతంలో కూడా వెంకటేష్ ‘సుందరాకాండ’ సినిమాలో లెక్చరర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా ఆరోజుల్లో పెద్ద సక్సెస్ సాధించింది. కథను దర్శకుడు తరుణ్ భాస్కర్ వెంకీ బాడీ లాంగ్వేజ్ కు, కామెడీ టైమింగ్ కు తగ్గట్లు మలిచాడని టాక్. ఏదిఏమైనా ఈసారి పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నాడు దర్శకుడు తరుణ్. ఈ సినిమా తరుణ్ భాస్కర్ సినీ జీవితాన్ని మలుపు తిప్పుతుందో లేదో చూడాలి మరి.











