టీడీపీలో సీనియర్ నాయకురాలు పీతల సుజాతకు పార్టీలో ఆదరణ కరువైంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కార్యవర్గంలో పీతల సుజాతకు చోటు దక్కలేదు. దీంతో ఆమె పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పశ్చిమగోదావరి జిల్లాలో వరదలకు నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలోనూ పీతల సుజాత ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్టయింది.
ఏమిటీ ఈమె ఘన చరిత్ర
సైన్్స డిగ్రీతో పాటు, బీ.ఎడ్ పూర్తి చేసుకుని ప్రభుత్వ టీచర్‌గా కొన్నేళ్లు పనిచేసిన పీతల సుజాత రాజకీయ ప్రవేశం కూడా విచిత్రంగానే జరిగింది. 2004 ఎన్నికలకు ముందు వరకూ ఆమె టీచర్ గా పనిచేశారు. 2004 ఎన్నికలకు ముందు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించారు. కొత్తగా ఆచంటను ఎస్సీలకు కేటాయించడంతో అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్ధులు కరవయ్యారు. ఆ సమయంలో పీతల సుజాత అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడుని కలసి పార్టీ టికెట్ కేటాయిస్తే ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని పోటీ చేస్తానని చెప్పడంతో ఆమె రాజకీయ ప్రవేశానికి దారులు పడ్డాయి. 2004లో వైఎస్ ప్రభంజనంలోనూ పీతల సుజాత ఆచంటలో విజయ బావుటా ఎగుర వేశారు. ఇదే ఆమె 2014లో మంత్రి పదవి దక్కించుకోవడానికి గట్టి పునాదిగా చెప్పుకోవచ్చు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో కీలక మంత్రి పదవిలో కొనసాగారు. ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా పార్టీ అండగా నిలబడింది. అయితే 2019లో ఆమెకు టికెట్ దక్కలేదు. అయినా పీతల సుజాత టీడీపీలోనే కొనసాగారు. ఆ తరవాత టీడీపీ ఓడిపోవడంతో ఒకటిన్నర సంవత్సరంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా టీడీపీ ప్రకటించిన కార్యవర్గంలోనూ ఆమెకు చోటు దక్కకపోవడంతో ఇక పీతల సుజాత పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
వైఎస్సార్సీపీ నేతలతో సంప్రదింపులు
పీతల సుజాత వైఎస్సార్సీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎక్కడా వైఎస్సార్సీపీ నుంచి టికెట్ హామీ లభించకపోవడంతో వేచిచూసే దోరణిలో ఉన్నారట. బీజేపీలో చేరినా గెలిచే అవకాశాలు లేవు. ఇక జనసేన అంటే పోరాటాలకే పరిమితం. ఆ పార్టీ నుంచి గెలచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇప్పట్లో అయ్యే పనికాదు. అందుకే పీతల సుజాత చూపు వైఎస్సార్సీపీ వైపే ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.