(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
విజయవాడ నగరంలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ తీసికట్టుగా తయారవుతోంది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో రెండు వైసీపీ గెలుచుకున్నా పార్టీ పరిస్థితి మాత్రం నానాటికీ దిగజారిపోతోంది. విజయవాడ వెస్ట్ నుంచి గెలిచి దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు క్యాబినెట్ మీటింగుల్లో చర్చకు వచ్చిన అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నాడని సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రిపై గుర్రుగా ఉన్నారట.
తాజాగా దుర్గగుడి వెండిరథంపై ఉన్న నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు మాయం కావడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పరువు తీసింది. దీంతో వెల్లంపల్లి మంత్రి పదవి పోతుందంటూ విజయవాడలో ఏ ఇద్దరు కలసినా అదే చర్చించుకుంటున్నారు. ఇక పీకల్లోతు కష్టాల్లో ఉన్న మంత్రి వెల్లంపల్లి- వైసీపీని బలోపేతం చేేసే పరిస్థితిలో లేరని తెలస్తోంది. దీంతో పార్టీ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారిపోతోంది.
మల్లాది విష్ణు కనిపించరు, వినిపించరు?
విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి కేవలం 25 ఓట్ల మెజారితో గెలచిన మల్లాది విష్ణు పార్టీలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని సమాచారం. టీడీపీలో విజయవాడ సెంట్రల్ నుంచి ఓడిపోయిన బోండా ఉమా- ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని తీవ్ర విమర్శలు చేస్తున్నా మల్లాది విష్ణు కనీసం కౌంటర్ కూడా వేయడం లేదు. దీంతో ఆయన మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.
వైసీపీలో అంతా రెడ్డి రాజ్యం నడుస్తోందని, వారితో అంటీముట్టనట్లు వ్యవహరించడమే సరైన వ్యవహారంగా ఆయన భావిస్తున్నారట. అందుకే మల్లాది, ఎప్పుడో నెలకోసారి మీడియాలో కనిపించి మాయం అవుతున్నారని వినికిడి.
కొత్తగా ఒక్క అభివృద్ధీ లేదెందుకో..?
2014 నుంచి 2019 వరకు విజయవాడలో అభివృద్ధి పనులు పరుగులు తీశాయి. సాధ్యం కాదని మూలన పడేసిన దుర్గగుడి ఫ్లైఓవర్ ఫైలు దుమ్ముదులిపి విజయవాడ ఎంపీ కేశినేని, అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించారు. 2015లోనే పనులు ప్రారంభించినా నిర్మాణ కంపెనీ చేతకాని తనంతో పనులు నత్తనడకన ఐదేళ్లు నడిచాయి. నేడు విజయవాడకు దుర్గగుడి ఫ్లైఓవర్ ఐకానిక్ గా నిలిచింది.
అలాగే బెంజి సర్కిల్ వద్ద 2.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను పూర్తి చేశారు. విజయవాడ నగరం ఏర్పడిన తరవాత విజయవాడలో మూడు పైవంతెలు వస్తే, టీడీపీ ఐదేళ్ల పాలనలో విజయవాడలో రెండు అతిపెద్ద పైవంతెనలు పూర్తి చేశారు. ఇక నగరం పరిశుభ్రత విషయంలోనూ యంత్రాలను ప్రవేశపెట్టి దేశంలోనే చాలా సార్లు టాప్ 5 ర్యాంకుల్లో నిలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో కేవలం చెప్పుకోదగ్గది ఒక్క పని కూడా చేపట్టలేదని విజయవాడ నగర ప్రజలు గుర్రుగా ఉన్నారు. కేవలం పంచుడు తప్ప అభివృద్ధి ఊసేలేదని వామపక్షాల నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే?
విజయవాడలో ఇదే ఒరవడి కొనసాగితే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీకి భంగపాటు తప్పదని తెలుస్తోంది. అందుకే ఎప్పుడో టీడీపీ ప్రారంభించి 90 శాతం పూర్తి చేసిన పనులను తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. దుర్గగుడి పైవంతెన విషయంలోనూ ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పని జగనన్న సంవత్సరంలోనే చేశారని చెప్పుకునే ప్రయత్నం ఫలించేలా కనిపించడం లేదు.
అందుకే కొత్తగా బెంజ్ సర్కిల్ వద్ద రెండో ఫ్లైవర్ కు శంఖుస్థాపన చేయడంతోపాటు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరంలో చిన్న చిన్న పనులు చేపట్టాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. లేదంటే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా విజయవాడలో వైసీపీ ప్రభ కొడిగడుతున్నట్టు అర్థం అవుతోంది.











