కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఎంతోమందిని బలి తీసుకుంది. మరెన్నో కుటంబాలను రోడ్డున పడేలా చేసింది. కుటుంబ పెద్దలను, ఆత్మీయులను కోల్పోయి ఎంతోమంది పిల్లలు అనాథలయ్యారు. ఇప్పటివరకు యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొవిడ్ బారిన పడ్డారు. అయితే పిల్లలపై ప్రభావం కొంతమేర చూపినా.. ఎలాంటి మరణాలు జరగలేదు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు ప్రధానంగా పిల్లలపై ప్రభావం చూపుతుందంటున్నారు పలువురు సైంటిస్టులు. ముప్పు ఉన్నా.. లేకున్నా పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆ జిల్లాలో 1400 మంది పిల్లలకు పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత వరకు తగ్గినా.. ఖమ్మం జిల్లాపై మాత్రం విరుచుపడుతోంది. ఇటీవల జరిపిన ఫీవర్ సర్వేలో లెక్కకు మంచి కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా 5 నుంచి 12 ఏండ్ల లోపు పిల్లలు కోవిడ్ బారిన పడుతున్నారు. గడిచిన 21 రోజుల్లో 1400 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లా వ్యాప్తంగా 16,302 కేసులు నమోదు అయితే.. 1400 మంది పిల్లల మహమ్మారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెల నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించించడంతో.. తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తే.. అక్కడ వైరస్ వ్యాప్తి చెంది కరోన బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పిస్తేకానీ.. బడులకు పంపించేదీ లేదంటూ తేల్చి చెప్తున్నారు.
కొవిడ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో వసతులు నిల్
కరోనా ఉధృతిలో థర్డ్ వేవ్ కూడా ఉంటున్నందన్న హెచ్చరికలతో రాష్ట్ర సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రంలో మొదటిసారిగా పిల్లల కోసం కోవిడ్ ఆస్పత్రిని ఖమ్మంలో ప్రారంభించింది. అయితే మొత్తం 40 బెడ్స్ పాటు 35 వెంటిలేటర్లను మాత్రమే సమకూర్చింది. 12 ఏండ్ల లోపు పిల్లలకు కరోనా సోకితే ఇక్కడ ఉచితంగా వైద్యం చేస్తామని ప్రకటించింది. అయితే వందల సంఖ్యలో పిల్లలు కొవిడ్ బారిన పడటంతో ప్రభుత్వ లక్ష్యం ఏమాత్రం నెరవేరడం లేదు. హాస్పిటల్ లో కేవలం 40 బెడ్స్ ఉండటం, డాక్టర్లు, కనీస వసతులు లేకపోవడంతో ప్రైవేట్ లో చికిత్స చేయించుకుంటున్నారు చాలామంది.
కొన్ని సూచనలు
- చిన్నారులు కొవిడ్ బారిన పడకుండా ఉండాలంటే వారు వీలైనంత బయట తిరగకుండా చూడాలి.
- బంధువులకు దూరంగా ఉంచాలి.
- చిన్నారులకు శుభ్రత అలవాటు చేయాలి.
- పౌష్టికాహారం విధిగా అందించాలి.
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలి.
- జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు బయట పడితే ఇంట్లోనే ఐసోలేట్ చేయాలి.
Must Read ;- కరోనా థర్డ్ వేవ్ తరుముకొస్తోంది!











